ఆత్మహత్య చేసుకున్న నవవధువు

ఆత్మహత్య చేసుకున్న నవవధువు

వివాహం జరిగి రెండు నెలలు గడవకుండానే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పటవల గ్రామానికి చెందిన బీఎస్పీ, బీఈడీ చదివిన బడుగు గంగా భవానీకి, కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేట గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగా కృష్ణమూర్తికి అక్టోబరు–21వ తేదీన వివాహం జరిగింది. ఏమైందో తెలియదుగాని మంగళవారం అర్ధరాత్రి గంగాభవానీ పటవలలోని తన స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

బుధవారం ఉదయం తలుపు తెరచి చూడగా విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కాకినాడ డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాసు ఘటనా స్థలానికి వచ్చి విచారణ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్‌ దంపతులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.