వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి

వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి

బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్‌కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్‌ కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్‌ పార్టీ జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్‌ క్లీన్‌ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు.