అమెరికాలో బీజేపీ ఎంపీని బెంబేలెత్తించిన ప్రత్యేక హోదా నిరసన సెగ

NRI's attack on BJP MP GVL Narasimha Rao in America

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకి సంబందించిన బీజేపీ నేతలు వెళ్ళిన ప్రతిచోటా వారికి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. చివరికి అమెరికా వెళ్లినా బీజేపీ నాయకులకు ప్రతిఘటనలు ఎదురు కావడం ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. తెలుగు వ్యక్తే అయినా ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా అధిష్టానం ఆశీసులతో రాజ్యసభ ఎంపీ అయిన జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. మోడీ చేసిన వంచనను మసి పూసి మారేడు కాయ చేసి టీడీపీ మీదకు నెపం తోసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఆయనకు ప్రతిఘటన తప్పడం లేదు. తాజాగా న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో బీజేపీ ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతాపార్టీ ఆఫ్ బీజేపీ యూఎస్ఎ’ పేరిట అమెరికాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ను ఆహ్వానించారు.

ఆయన ఎప్పటిలాగానే… ప్రత్యేకహోదా వంచన విషయంలో పాత పాట పాడడం ప్రారంభించారు. హోదా ను మించిన ప్యాకేజి ఇస్తున్నామని, చంద్రబాబు తీసుకోవడం లేదని, నానా అవాకులు చెవాకులు పేలడం ప్రారంభించారు. ఈ వరుస అబద్దాలను సహించలేకపోయిన సభికులైన ప్రవాసాంధ్రులు లేచి నిల్చోని, మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ నిలదీశారు. సభలో గందరగోళం చెలరేగింది. బీజేపీ నేతల తీరుకు నిరసనగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. దీంతో బీజేపీ నేతలకు చెమటలు పట్టినంతపనైంది. సభలోని ఆంధ్రప్రదేశ్ తరపున గళం విప్పుతున్న ఎన్నార్యేలను అమెరికా పోలీసులతో నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. అయితే ఈ నిరసనలు కూడా వ్యూహాత్మకంగా చేసారని జీవీఎల్ ఆరోపిస్తున్నారు. కావాలనే ప్లాన్ చేసి చేస్తున్నవే అని, మీరు అందరూ దుష్ప్రచారపు మాయలో పడుతున్నారని” నరసింహారావు కాసేపు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు వినే పరిస్థితి లేకపోవడంతో నరసింహారావు ప్రసంగాన్ని అడ్డుకున్న వారిని బలవంతంగా సభనుంచి బయటకు పంపించారు. అయినా నినాదాల తాకిడి తట్టుకోలేకపోయిన నరసింహారావు తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించేశారని తెలుస్తోంది.