#ఎన్టీఆర్ పిక్ టాక్: అసెంబ్లీ ముందు వీరావేశంతో నందమూరి

తెలుగు సినిమా ఉన్నంత కాలం తెలుగు ప్రజల మనస్సులో కొలువైవుండే నటుడు ‘నందమూరి తారక రామారావు’. ఎన్నాళ్ళనుండో ఎన్టీఆర్ జీవితకథ ను వెండితెరపైన వీక్షించాలని ఎదురుచూస్తున్న తెలుగు సినీ అభిమానుల కోరికను నెరవేర్చడానికి ఎన్టీఆర్ తనయుడు, నటసింహం గా పిలువబడే నందమూరి బాలకృష్ణ పూనుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ జీవితకథను ఒక సినిమాలో చెప్పడం కష్టతరంగా భావించి, “కథానాయకుడు మరియు మహానాయకుడు” అనే రెండు భాగాలుగా ఈ సినిమాని విడుదలచేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని నటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యి, మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా మీద అంచనాలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి.

image.png

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన ‘కథానాయకుడు’ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయనుండడంతో, సినిమాకి సంబంధించిన ప్రొమోషన్లను చిత్రం యూనిట్ ప్రారంభించింది. ఈ ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని మొదటి పాటను రేపు ఆదివారం ఉదయం 7.42 గంటలకు విడుదల చేయనున్నట్లు, ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు అవతారంలో అసెంబ్లీ ముందు వీరావేశంగా నడుస్తుండడం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏమాటకామాటే, ఎన్టీఆర్ రూపంలో బాలకృష్ణ తన తండ్రిని తలపిస్తున్నారని చూసినవాళ్లంతా అనుకోవడం ఖాయం. మొత్తానికి తన తండ్రి పాత్రలోకి బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంది. ఈ సినిమాకి సంగీతం ఎం. ఎం. కీరవాణి అందిస్తున్నారు.