కథానాయకుడు ఎఫెక్ట్…మహా నాయకుడు వాయిదా…!

NTR Mahanayakudu Postponed By A Week

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా తొలిభాగం ‘కథానాయకుడు’ జనవరి 9న విడులైంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ బయోపిక్ కావడం, ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన తర్వాత అనుకున్న విధంగా ప్రేక్షకులను మెచ్చించలేకపోయింది ఈ చిత్రం. దీంతో నిరాశ చెందిన యూనిట్ రెండో భాగాన్ని కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి భాగం ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగం ‘మహానాయకుడు’లో రాజకీయ జీవితాన్ని చూపించాలని భావించారు. రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది. తొలి భాగం నిరాశ పరచడంతో రెండో భాగం విడుదలకు యూనిట్ ఆలోచనలో పడిందట.

రెండో భాగం అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని యూనిట్ ఆలోచిస్తోందట. నిజానికి మొదటి భాగం కంటే రెండో భాగానికే ప్రేక్షకుల్లో ఎక్కువ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి నిజాలను దాచిపెట్టి సినిమా తెరకెక్కించారని ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి.మరోవైపు తనను సినిమాలో విలన్‌ గా చూపిస్తే కోర్టును ఆశ్రయిస్తానని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మీడియాకెక్కారు. ఇటీవల అనేక యూట్యాూబ్ చానళ్లకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ గురించి అనేక వివాదాస్పద విషయాలు వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ గురించి నాదెండ్ల చెప్పిన సంగతులన్నీ ఈ సినిమాలో ఉంటాయోలేదోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ వాయిదా వేసే యోచనలో యూనిట్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీని మీద అధికారికంగా ఇటువంటి ప్రకటన లేనప్పటికీ బాలయ్య సన్నిహితుల దగ్గర నుండి ఈ విషయం బయటకు రావడంతో సినిమా వాయిదా పడటం దాదాపు నిజమే అని అంటున్నారు.