వరకట్నం వేధింపులకు మరో యువతి బలి

వరకట్నం వేధింపులకు మరో యువతి బలి

మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తను కాదని మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరికి వరకట్నం వేధింపులకు నిండు జీవితం బలైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై రాజయ్య కథనం ప్రకారం..సారంగాపూర్‌ మండలం నాగునూర్‌ గ్రామానికి చెందిన నలువాల నర్మద (22) అనే వివాహిత యువతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. గతంలో పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్లు కాపురం చేసింది. అంతలోనే భర్త, అత్త , బావలు వరకట్నం వేధింపులకు గురి చేయడంతో తల్లిగారింటికి వచ్చి ఉరి వేసుకుంది.

జగిత్యాల రూరల్‌ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన నలువాల శ్రీనివాస్‌ని నర్మద ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నినెలలపాటు వీరిదాంపత్యం సాఫీగానే సాగింది. వరకట్న వేధింపులు నర్మదను కష్టాల్లోకి నెట్టాయి. భర్త శ్రీనివాస్‌తోపాటు, అత్త నలువాల లక్ష్మీ, బావ నలువాల అనిల్‌ రూ.2 లక్షలు తీసుకురావాలని వేధించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన నర్మద కుటుంబసభ్యులకు చెప్పగా పెద్దల సమక్షంలో చర్చించి కాపురం సాఫీగా సాగేలా చేశారు. అయినా వేధింపులు ఆగలేదు. మార్చిలో నాగునూర్‌ గ్రామంలో తల్లిగారింటికి రాగా శుక్రవారం భర్త శ్రీనివాస్‌ గ్రామానికి వచ్చి నర్మదను దూషించాడు. గ్రామస్తులంతా గమనిస్తుండగానే తిడుతూ ఆమెపై చేయిచేసుకున్నాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మనస్తాపానికి గురైన నర్మద ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీస్‌వాహనంలో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సారంగాపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పంచనామా నిర్వహించారు. నర్మద భర్త శ్రీనివాస్, అత్త లక్ష్మీ, బావ అనిల్‌ ముగ్గురిపై మృతురాలి తల్లి అరికిల్ల శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.