మరో మలుపు తిరిగిన జయరాం కేసు !

One More Twist In Jayaram Case

తన భర్త మరణం కలచివేసిందని, మానసికంగా కుంగదీసిందని జయరామ్ భార్య పద్మ శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె తన కోడలు శిఖా మీద తెలివిగా ఫిర్యాదు చేశారు. ఆంధ్ర పోలీసుల పట్ల నమ్మకం లేదన్న ఆమె తెలంగాణ పోలీసులు ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరారు. శిఖా చౌదరి అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు దోచుకెళ్లిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇక్కడ తీగ లాగితే ఏపీలో డొంక కదిలేలా ఆమె ఫిర్యాదు చేసిందని భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన భర్తను కిరాతకంగా హత్య చేశారన్న పద్మ శ్రీ తన పిల్లలు తండ్రిలేని వారయ్యారని వాపోయారు. జయరామ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తనకు ఫోన్లో చెప్పారని, కానీ ఆయన్ను హత్య చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో రాకేశ్ వ్యవహారాలు, శిఖా పాత్రపై దర్యాప్తు చేపట్టాలని పద్మ శ్రీ డిమాండ్ చేశారు. జయరామ్ మరణ వార్త తెలిసిన తర్వాత ఆమె సంఘటనా స్థలానికి వెళ్లకుండా వాచ్‌ మెన్‌ ను బెదిరించి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. తన ఇంట్లోకి వచ్చే హక్కు శిఖాకు లేదని తన ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునే హక్కు లేదన్నారు. శిఖా చౌదరికి డబ్బులు, ఆస్తులపై వ్యామోహం ఎక్కువని తన భర్తను హైదరాబాద్‌లో హతమొందించి మృతదేహాన్ని ఆంధ్ర పరిధిలోకి తీసుకెళ్లడం ద్వారా కేసును పరిధి దాటించారని ఈ కేసును తెలంగాణ పోలీసులే విచారించాలని కోరినట్లు సమాచారం. శిఖా చౌదరి ఏపీ పోలీసులను ప్రభావితం చేసి ఉండొచ్చని కానీ ఈ కేసులో తనకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. తమ ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు పోయాయని పద్మ శ్రీ తమకు ఫిర్యాదు చేశారని తెలంగాణ పోలీసులు అధికారులు తెలిపారు. శిఖా చౌదరి, మరో వ్యక్తి ఇంటికి వచ్చినట్లు వాచ్‌ మెన్ చెప్పాడని పద్మ శ్రీ తమకు తెలిపిందన్నారు. తన భర్త హత్య కేసులో జోక్యం చేసుకోవాలని పద్మ శ్రీ కోరారా? అని మీడియా ప్రశ్నించగా స్పందించడానికి నిరాకరించారు. పద్మ శ్రీ ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకుంటామన్నారు.