ప‌ద్మావ‌తి డిసెంబ‌రు 1న రావ‌డం లేదు

Padmavathi Movie Postponed

ప‌ద్మావ‌తి డిసెంబ‌రు 1న రావ‌డం లేదు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌ద్మావ‌తి విడుద‌ల వాయిదా ప‌డింది. ముందుగా అనుకున్న దాని ప్ర‌కారం డిసెంబ‌రు 1న చిత్రం విడుద‌ల కావాల్సి ఉండ‌గా…ఇప్పుడు సినిమాను వాయిదావేస్తూ చిత్ర‌యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త విడుద‌ల తేదీని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ప‌ద్మావ‌తిపై వివాదాల‌తో పాటు సీబీఎఫ్ సీ నుంచి స‌ర్టిపికెట్ రాక‌పోవ‌డ‌మే సినిమా వాయిదాకు కార‌ణమ‌ని భావిస్తున్నారు. సినిమా విడుద‌ల వాయిదా వేయాల‌ని  స్వ‌చ్చందంగా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వైకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. చ‌ట్టం, సీబీఎఫ్ సీ ల‌ను గౌర‌విస్తున్నామ‌ని వైకామ్ 18 అధికార ప్ర‌తినిధి వ్యాఖ్యానించారు. సినిమా విడుద‌ల‌కు కావాల్సిన అన్ని అనుమ‌తులు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు అసంపూర్ణంగా ఉంద‌న్న కార‌ణంతో ప‌ద్మావ‌తికి సర్టిఫికెట్ ఇవ్వ‌కుండా సీబీఎఫ్ సీ వెన‌క్కి పంపింది. సినిమాను సెన్సార్ బోర్డు కన్నా ముందు మీడియా చానల్స్ కు చూపించ‌డాన్ని సీబీఎఫ్ సీ చీఫ్ ప్రసూన్ జోషి త‌ప్పుబ‌ట్టారు. నిర్మాణ‌ద‌శ నుంచే ప‌ద్మావ‌తి ప‌లు అడ్డంకులు ఎదుర్కొంది.
చిత్తోర్ రాణి ప‌ద్మిణి జీవిత‌కథ ఆధారంగా నిర్మించిన ప‌ద్మావ‌తిలో రాజ్ పుత్ ల చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని తొలినుంచీ రాజ్ పుత్ క‌ర్ణిసేన ఆరోపిస్తోంది. ప‌ద్మావ‌తికి, ఖిల్జీకి మ‌ధ్య   స‌న్నిహిత స‌న్నివేశాలు సినిమాలో చిత్రీక‌రించార‌ని, చ‌రిత్ర ప్ర‌కారం వారిద్దరూ ఒక్క‌సారి కూడా క‌లుసుకోలేద‌ని క‌ర్ణిసేన చెబుతోంది. సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని తొలినుంచి క‌ర్ణిసేన స‌భ్యులు హెచ్చ‌రిస్తూ వ‌చ్చారు. రాజ్ పుత్ లు భ‌య‌ప‌డేట‌ట్టుగా సినిమాలో ఎలాంటి స‌న్నివేశాలూ లేవ‌ని, ప‌ద్మావ‌తి పాత్ర‌ధారి దీపిక ప‌దుకునే, ఖిల్జీ పాత్ర‌ధారి ర‌ణ్ వీర్ సింగ్ సినిమాలో ఎక్క‌డా క‌లిసి క‌నిపించ‌ర‌ని ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప‌దే ప‌దే చెప్తున్న‌ప్ప‌టికీ…రాజ్ పుత్ క‌ర్ణిసేన వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. రాజ‌స్థాన్ స‌హా అనేక రాష్ట్రాల్లో క‌ర్ణిసేన ఆధ్వ‌ర్యంలో ప‌ద్మావ‌తికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. దీంతో తొలినుంచీ సినిమా డిసెంబ‌రు 1న విడుద‌ల‌వ‌డంపై సందేహాలు నెల‌కొన్నాయి. ఇప్పుడు సీబీఎఫ్ సీ స‌ర్టిఫికెట్ కూడా రాక‌పోవ‌డంతో…ప‌ద్మావ‌తిని వాయిదా వేయక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.