పైసా వసూల్ మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

paisa vasool Movie review

నటీనటులు :  బాలకృష్ణ , శ్రియ , ముస్స్కాన్ సేతి 
నిర్మాత :    ఆనంద్ ప్రసాద్ 
దర్శకత్వం :   పూరి జగన్నాధ్ 
మ్యూజిక్ డైరెక్టర్ :   అనూప్ రూబెన్స్ 
ఎడిటర్ :    జునైద్ సిద్దికి 
సినిమాటోగ్రఫీ :  ముకేష్ 

నందమూరి బాలయ్య, పూరి జగన్నాధ్ …ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే సంతోషపడిన వాళ్ళ కన్నా ఆశ్చర్యపోయిన జనాలు ఎక్కువ. చివరకు ఆ ఇద్దరి ని అభిమానించే వారితో సహా. బాలయ్య ఏమో గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి హిట్ తో మంచి జోష్ లో వున్నాడు. పూరి ఏమో కొన్నాళ్లుగా ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఇక రీసెంట్ గా డ్రగ్స్ ఎపిసోడ్ కూడా దానికి తోడైంది. అలాంటి పరిస్థితుల్లో పూరితో సినిమాకి బాలయ్య ఓకే చెప్పడం ఓ ఎత్తు అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఇంతగా అందరికీ ఆశ్చర్యం కలిగించిన పైసా వసూల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉందోలేదో చూద్దామా !

కథ :

బాబ్ మార్లో అనే అంతర్జాతీయ నేరగాడిని పట్టుకోడానికి భారతదేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ స్థాయి క్రిమినల్ ని పట్టుకోడానికి ఇంకో క్రిమినల్ మెంటాలిటీ వున్న వాడి కోసం వెతుకుతుంటే తేడా సింగ్ ( బాలయ్య ) కనిపిస్తాడు వారికి. పోర్చుగల్ లో క్యాబ్ డ్రైవర్ గా పని చేసుకునే అతను తేడాగా ఉంటాడు .వాళ్ళు ఊహించిన దానికంటే చిత్రవిచిత్రంగా ప్రవర్తించే తేడా సింగ్ ని బాబ్ మార్లో మీద ప్రయోగించడానికి ఇంటలిజెన్స్ వ్యూహం రూపొందిస్తుంది. అయితే అసలే తేడాగా వుండే తేడా సింగ్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటాడా ? అసలు తేడా సింగ్ అంత తేడాగా ఎందుకు మారాడు ? చివరకు బాబ్ మార్లో దొరుకుతాడా అన్నది మిగతా కధ.

విశ్లేషణ :

కధ గా చెప్పుకోడానికి పైసా వసూల్ లో పెద్దగా ఏమీ లేదు. ఈ తరహా కధలు ఇంతకుముందు వెండితెర మీద చాలా వచ్చాయి. అయితే కధనం, హీరో క్యారక్టరైజేషన్ ని నమ్ముకుని ఈ సినిమాని పూరి నడిపించాడు. పూరి పాత్రకు బాలయ్య ప్రాణం పోసాడు. అచ్చమ్ పూరి మార్క్ హీరోలా మారిపోయాడు. తన వయసు, ఇంతకుముందు చేసిన పాత్రలు, ఇమేజ్, తొక్కతోలు వంటి విషయాలు పూర్తిగా పక్కనబెట్టి పూరి తయారు చేసిన బొమ్మగా మారిపోయాడు. 100 సినిమాలు చేసిన హీరో 101 వ సినిమాతో ఇంతగా మారిపోతాడని ఎవరూ ఊహించరు. కానీ అదే జరిగింది. 57 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రోడు చేసినట్టు చేసాడు బాలయ్య. బాలయ్య పాత్రకి తగ్గట్టే సినిమా కధనం కూడా రేసు గుర్రంలా పరుగులు తీసింది. ఇక ఈ సినిమా కోసం పూరి రాసిన డైలాగ్స్ కొన్నాళ్ల పాటు జనం నోట వినిపించడం ఖాయం. ఆయన రాసిన వన్ లైనర్స్ బాలయ్య చెప్పడం bhale gaa వుంది. బాలయ్య క్యారెక్టర్ తో పండిన వినోదాన్ని మించి కామెడీ చేయలేకపోయాడు పూరి ఈ సినిమాలో. అదే ఈ సినిమాకి కాస్త మైనస్. ఇక హీరోయిన్స్ వాళ్ళ పాత్రలకి తగ్గట్టు బాగా చేశారు. ఏదో కొత్త సినిమా చూద్దామని కాకుండా పక్కా మాస్ మసాలా సినిమా చూద్దాం అనుకుంటే పైసా వసూల్ పక్కాగా పైసా వసూల్ సినిమా.అనూప్ సంగీతం, ముకేశ్ కెమెరా వర్క్ చాలా బాగున్నాయి. జునైద్ ఎడిటింగ్ షార్ప్ గా వుంది. ఈ సినిమా నిర్మించిన భవ్య క్రియేషన్స్, నిర్మాత ఆనంద్ ప్రసాద్ సినిమాని తీయడంలో, ప్రమోట్ చేయడంలో ఎక్కడా రాజీ పడలేదు.

సినిమా ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన
పూరి డైలాగ్స్
రేసీ స్క్రీన్ ప్లే
పాటలు,పోరాటాలు
మ్యూజిక్,కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ కధ

తెలుగు బులెట్ పంచ్ లైన్ … తేడా సింగ్ తో “పైసా వసూల్ ”

తెలుగు బులెట్ రేటింగ్ ….3 / 5 .