చైతన్య , నారాయణ మధ్య రాజీ ప్రయత్నాలలో పేరెంట్స్ …

Parents are trying to compromise between Chaitanya and Narayana

ఒకప్పుడు రాజ్యాల మధ్య ఇప్పుడు కార్పొరేట్ సంస్థల మధ్య పోరాటాలు, సంధులు సర్వసాధారణం అయ్యాయి . రెండు కార్పొరేట్ సంస్థల మధ్య గొడవలు ఎందుకు వచ్చినా వాటిని తీర్చడం మాత్రం ఆషామాషీ విషయం కాదు. రిలయన్స్ ని పంచుకునే సమయంలో ముకేశ్ , అనిల్ అంబానీల మధ్య గొడవలు రాకుండా చూసేందుకు ఎంత పెద్ద కసరత్తు జరిగిందో చూసాం. అంబానీల మాతృమూర్తి తో పాటు తలపండిన మేధావులు ఎందరో రంగంలోకి దిగారు. ఇప్పుడు కూడా ఓ కార్పొరేట్ యుద్ధానికి తెర దించడానికి , సంధి కుదర్చడానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. విద్యారంగంలో పోటీతో ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న నారాయణ , చైతన్య మధ్య సంధి కోసం ఓ ప్రయత్నం మొదలైంది. ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది మాత్రం ఆ సంస్థల ప్రతినిధులు కాదు. ఆ రెండు సంస్థలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన చైనా బ్యాచ్ లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. వినడానికి , చూడడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజంగా నిజం.

విద్యారంగంలో అనారోగ్యకర పోటీ నివారణకు ఒకప్పుడు చైతన్య , నారాయణ సంస్థలు పెద్ద మనస్సుతో చేసిన ప్రయత్నమే చైనా బ్యాచ్. రెండు సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చైనా బ్యాచ్ అందుకు తగ్గట్టే మంచి ఫలితాలు సాధించింది. అయితే ఆ సంస్థల మధ్య ఏర్పడ్డ విభేదాల ప్రభావంతో చైనా నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే ఈ బ్యాచ్ నిర్వహణ తో ముడిపడ్డ తమ పిల్లల భవిష్యత్ తో పాటు మెరుగైన , నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఓ సమావేశం నిర్వహించారు. ఓ విధంగా చెప్పాలంటే మీరు ఇద్దరు కలిసి చైనా బ్యాచ్ నిర్వహించాల్సిందే అని చైతన్య , నారాయణ కి విజ్ఞాపన , విన్నపం , సూచన ఎలా వీలైతే అలా చెప్పేసారు. ఓ దశలో చైనా బ్యాచ్ నిర్వహణకు ఎస్ చెప్పాలని ధర్నా చేసే దాకా వెళ్లారు. రెండు కార్పొరేట్ విద్యా దిగ్గజాలని కలపడానికి జరిగిన ఈ ప్రయత్నం కొందరికి కామెడీగా అనిపించినా , ఆ సంస్థల శక్తిసామర్ధ్యాలు తెలిసిన వారిలో మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. విద్యార్థుల తల్లదండ్రులు లేవనెత్తిన ఈ అంశం లోతు , వారి మనోభావాలు గ్రహించి , గౌరవించి చైనా బ్యాచ్ విషయంలో నారాయణ మెత్తబడినట్టు తెలుస్తోంది.ఇక చైతన్య మాత్రం కాస్త పట్టుదలకు పోతోందట. అయితే ఆవేశం కన్నా ఆలోచన మంచి ఫలితాలు ఇస్తుంది. విద్యార్ధులకి ఉన్నత భవిష్యత్ ఇవ్వడం అంటే దేశానికి ఉజ్వల భవిష్యత్ అందించడమే కదా. ఈ విషయాలను విద్యా రంగ దిగ్గజం చైతన్యకి పిల్లల తల్లిదండ్రులో, మీడియానో చెప్పాల్సిన అవసరం ఉందా ?