టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి నిన్న హైదరాబాద్‌లోని స్వ గృహంలో కన్నుమూశారు. ఆమె కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఈమెకు భర్త బండారు సారయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. హౌసింగ్ బోర్డులో ఉద్యోగి అయిన శారారాణి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 2004లో పరకాల నుంచి టీఆర్‌ఎస్ టికెట్‌పై అసెంబ్లీకి పోటీచేసి టీడీపీ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 34,597 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత శారారాణి, తన అసమ్మతి స్వరాన్ని వినిపించడంతో టీఆర్ఎస్ అధినేత ఆమెను పక్కనబెట్టారు. దీంతో కొన్నేళ్ళగా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూ రంగా ఉంటున్నారు. ఈమె భర్త బండారి సారయ్య అప్పట్లో డీఎస్పీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఆయన కొంతకాలం క్రితం ఏసీపీగా విధులు నిర్వహిస్తూ రిటైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే శారారాణి మృతిపట్ల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంతాపం తెలిపారు.