జగన్ పార్టీ తొలి అడుగు….ఈరోజే శాసనసభాపక్ష సమావేశం

Jagan's party is the first step. Today is the legislative assembly meeting.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా తొలి అడుగు వేసేందుకు సిద్దమైనట్టు సమాచారం అందుతోంది. ఈరోజు ఉదయం 10.31 గంటలకు మంచి ముహూర్తం ఉండడంతో వైసీపీ శాసనసభాపక్షం  అదే సమయానికి తొలిగా సమావేశం కానుంది.
     పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ ఒక్క అజెండాతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశం తర్వాత తీర్మాన ప్రతిని సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలిసి జగన్ అందచేయనున్నారు. శాసనసభాపక్ష సమావేశం ముగిసిన వెంటనే జగన్ పార్లమెంటరీ సభాపక్షంతో సమావేశం కానున్నారు.

     ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేతను ఎంపీలు ఎన్నుకోనున్నారు. ఇప్పటికే రెడ్డి పార్టీ అనే ముద్ర పడుతున్న నేపధ్యంలో రెడ్లకు కాకుండా రాష్ట్రంలో మరో ప్రధాన సామాజిక వర్గం అయిన కమ్మ సామాజిక వర్గ ఎంపీకి ఈ పదవి కట్టబెట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం నుంచి గెలిచిన వల్లభనేని బాలశౌరి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. జగన్‌కు సన్నిహితుడు కావడంతో పాటు పారిశ్రామిక వర్గాల్లో ఆయనకు మంచి పరిచయాలు ఉండటం వంటి అంశాలతో ఆయనకు ఈ పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది.