పార్ల‌మెంట్ లో అదే క‌థ‌… ఉభ‌య‌స‌భ‌లు రేప‌టికి వాయిదా…

Parliament Postponed again due to AIADMK and TRS MP's Protest

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
విభ‌జ‌న బాధిత ఏపీకి జ‌రిగిన అన్యాయం దేశం మొత్తానికి తెలిసే వీలు క‌ల్పించే అవిశ్వాస‌ తీర్మానాల‌పై పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో ఇవాళ కూడా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఊహించిన‌ట్టుగానే బీజేపీ వ్యూహం అమ‌లు చేస్తూ అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ అవిశ్వాస‌తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకున్నాయి. ఈ ఉద‌యం లోక్ స‌భ ప్రారంభం కాగానే… అవిశ్వాస‌తీర్మానంపై చ‌ర్చించాల‌ని టీడీపీ, వైసీపీ ప‌ట్టుబ‌ట్టాయి. అదే స‌మ‌యంలో కావేరీ జ‌లాల‌పై అన్నాడీఎంకె, రిజ‌ర్వేష‌న్ల పెంపుపై టీఆర్ ఎస్ ఆందోళ‌న వ్య‌క్తంచేశాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తుండ‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఎంత వారించిన అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ ఎంపీలు వినిపించుకోక‌పోవ‌డంతో ఆమె తొలుత స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదావేశారు.

అనంత‌రం స‌భ తిరిగి ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అవిశ్వాస తీర్మానాల‌ను చ‌దివి వినిపించిన స్పీక‌ర్, వీటిపై చ‌ర్చ జ‌రిపేందుకు స‌హ‌క‌రించాల‌ని ఎంపీల‌ను ప‌దే ప‌దే కోరారు. కాంగ్రెస్ నేత‌లు కూడా స‌భ కొన‌సాగించేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అయినా అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ ఎంపీలు త‌మ నిర‌స‌న‌లు ఆప‌లేదు. దీంతో స్పీక‌ర్ స‌భ ఆర్డ‌ర్ లో లేద‌ని, అవిశ్వాస‌తీర్మానాన్ని చ‌ర్చ‌కు స్వీక‌రించ‌లేమని చెప్పి… స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. రాజ్య‌స‌భ‌లోనూ ఇదే తంతు కొన‌సాగింది. అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ ఎంపీలు కూడా స‌భ‌లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. అన్ని అంశాల‌పై చ‌ర్చిద్దామ‌ని, స‌భ్యులు శాంతంగా వ్య‌వ‌హరించాల‌ని చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు విజ్ఞ‌ప్తిచేసినా… అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ ల‌క్ష్య‌పెట్ట‌లేదు. దీంతో స‌భ‌ను రేప‌టికి వాయిదావేస్తున్న‌ట్టు వెంక‌య్య ప్ర‌క‌టించారు.