నన్ను కొట్టడానికి తెలంగాణాలో 100 మంది వచ్చారు !

ఆంధ్రావాళ్లు తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు కాని తెలంగాణవాళ్లు వచ్చి ఆంధ్రాలో రాజకీయాలు చేయొచ్చా అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంపై కుట్రలు చేయడం కాదు దమ్ముంటే ఆంధ్రాకు వచ్చి ఎన్నికల్లో పోటీచేయాలని సవాల్ విసిరారు. తాను హైదరాబాద్ వస్తే కేసీఆర్, తలసాని వంటి వ్యక్తులు తట్టుకోలేరంటూ హెచ్చరించారు. ఆంధ్రాను అవమానిస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుంటామా అంటూ నిప్పులు చెరిగారు. భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. వైసీపీ, కేసీఆర్‌ల తీరుపై మండిపడ్డారు. తెలంగాణ మంత్రి తలసాని పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఎక్కడ అన్నారు వస్తున్నాగా స్వామీ కాస్త వెయిట్ చేయండి. గతంలో కేసీఆర్‌ను తిట్టిన వ్యక్తి భీమవరం వచ్చి మా ఆంధ్రుల్ని తిడతారా. ఆంధ్రా ప్రజలకు ఆత్మగౌరవం ఉంది ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడ టీఆర్ఎస్‌ను పెట్టండి అభ్యర్థిని నిలబెట్టుకోండి తప్పేం లేదే. ఇప్పుడు మీరు గతంలో ఛీకొట్టిన జగన్‌‌కు మద్దతు పలుకుతున్నారు ఆంధ్రుల్ని అవమానిస్తున్నారు. ఆంధ్రుల్ని తిడుతుంటే జగన్ వాళ్ళతో మాట్లాడరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అంటే భయం లేదు గౌరవం ఉంది ఓ ఉద్యమ నాయకుడన్న గౌరవం ఆయనకు ఇస్తాను. ఏం తెలంగాణ పాకిస్థాన్‌ల ఉందనుకుంటున్నారా. మనకు పౌరుషం లేదా.. తెలంగాణలో భయపెడితే ఆంధ్రకు వచ్చి రాజకీయాలను మార్చేస్తారా’ అంటూ పవన్ ప్రశ్నించారు. ఓసారి తాను తెలంగాణలో సభ పెడితే తనను కొట్టేందుకు ఏకంగా వందమంది వచ్చారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందమంది తన సభలో దూరిపోయి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తనను కొడితే కూర్చోబెట్టి చేతులు ముడుచుకుని ‘అయ్యా, బాబూ’ అనే రకం తాను కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. వారు కొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, తాము అల్లూరి స్ఫూర్తితో పెరిగిన వాళ్లమని పవన్ గుర్తు చేశారు. తాము సత్యమే మాట్లాడతామని, తప్పుంటే సరిదిద్దుకుంటామని పేర్కొన్న పవన్.. తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని, తోలుతీస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో తమ గొంతులు నొక్కే హక్కు ఎవరికీ లేదన్నారు. అది హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా ఎక్కడైనా అంతేనన్నారు. తాను భారతీయుడినని, ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని పవన్ స్పష్టం చేశారు. తనను కొట్టేందుకు ఎన్ని లక్షల మంది వచ్చినా భయపడనని పేర్కొన్న పవన్.. ఆ రోజు తనను కొట్టడానికి వచ్చిన వందమంది ఆ తర్వాత చప్పట్లు కొట్టి వెళ్లిపోయారని పవన్ పేర్కొన్నారు.