జగన్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత

జగన్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత

ఏపీ రాజధాని అమరావతిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్దతిలో, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని ట్వీట్ చేశారు. నేడు చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అయితే రైతుల నిరసనలు మొదలు కాకముందే జనసేన పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారని, ఇలాంటి చర్యలతో ఆందోళనలను ప్రభుత్వం ఆపలేదని అన్నారు.

అయితే అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయకండని, విశాఖ వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదని అన్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం తీవ్ర వెనకబాటులో ఉన్నాయని వాటి అభివృద్ధిపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవని, ఇకపోతే రాయలసీమ వాసులకు విశాఖకు వెళ్ళాలంటే ప్రయాణం ఎంతో కష్టతరమని ఈ విషయాన్ని సీమ వాసులు చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తుందని అన్నారు. ఇకపోతే హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజధాని మార్పును కోరుకోవడం లేదని వారు ఇప్పుడిప్పుడే అక్కడ కుదురుకున్నారని అన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలను చేపడతారని ప్రభుత్వం గ్రహించాలని అన్నారు.