హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

నగరంలోని కొండాపూర్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన మౌనిక(25) తన ఇద్దరు స్నేహితులతో హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మౌనిక కొండాపూర్‌లోని ఓయో(హోటల్స్‌)లో ఉద్యోగం చేస్తోంది. కొండాపూర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో మైనిక తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటోంది. 2015 నుంచి నగరంలోనే నివాసం ఉంటోంది మౌనిక. కాగా, సోమవారం రీహాన్ అనే స్నేహితుడు మౌనిక ఫ్లాట్‌కు వెళ్లగా ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే అతడు 108కు సమాచారం అందించాడు. మౌనిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మౌనకి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతిపై ఆమె నివసిస్తున్న ఫ్లాట్ యజమాని కసుల పునిత కూడా పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తాము సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో రెంట్ కోసం ఫ్లాట్‌కు వెళ్లామని పోలీసులకు తెలిపారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం మౌనిక స్నేహితుడు రీహాన్ ఆమె ఫ్లాట్‌కు 7గంటల ప్రాంతంలో వెళ్లి చూడగా ఆమె అప్పటికే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో వెల్లడించారు. అయితే మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇది ఇలావుండగా, నగరంలో మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా నర్సాపూర్‌కు చెందిన రంగినీధి మౌళీధర్(29)కు తల్లిదండ్రులు లేరు. హైదరాబాద్‌లోని పుప్పాలగూడ దుర్గానగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని సోదరి శ్రావణి ఉద్యోగం చేస్తూ మాదాపూర్‌లోని మహిళా హాస్టల్‌లో ఉంటోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి మౌళీధర్‌ ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదంటూ శ్రావణికి ఆమె బంధువు వచ్చి చెప్పారు. దీంతో వారిద్దరూ పుప్పాలగూడ వచ్చి చూడగా మౌళీధర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ముఖానికి కవర్ కట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు మౌళీధర్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.