ప్రధాని మోదీకి పెరిగిన ట్విటర్‌ ఫాలోవర్స్‌

ప్రధాని మోదీకి పెరిగిన ట్విటర్‌ ఫాలోవర్స్‌

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాకర్షక నాయకుడిగా ప్రధానమంత్రి ఒకరిగా ఉన్నారు. మోదీకి దేశంలో అత్యంత ప్రజాదరణ ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. పలు ఆసక్తికరమైన పోస్టులు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించారు.

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌లో ఏడు కోట్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని అగ్రభాగాన నిలిచారు. మొత్తం 70 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని కీలక మైలురాయిని దాటేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ 2009లో ట్విటర్‌ ఖాతా తెరిచారు. 2010 వరకు ఆయన ఫాలోవర్లు లక్షకే పరిమితమయ్యారు. పదకొండేళ్ల అనంతరం అంటే 2021కి ఏకంగా ఏడు కోట్లకు పైగా ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు.

ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక నరేంద్రమోదీని ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు మోదీ సోషల్‌ మీడియాను ఒక వేదికగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు దేశం, ప్రపంచంలో జరుగుతున్న పలు అంశాలపై స్పందిస్తుంటారు. పలుసార్లు సామాన్య ప్రజలను కూడా ట్విటర్‌ ద్వారా పలకరించి ఆశ్చర్యపరుస్తుంటారు.

అందుకే ప్రధాని మోదీకి ట్విటర్‌లో ఫాలోవర్స్‌ భారీగా పెరుగుతున్నారు. ప్రధాని ఈ మైలురాయిని అధిగమించడంపై కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ స్పందించారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి, నిర్ణయాత్మక చర్యలు ప్రజాదరణను మరింత పెంచుతోంది. ఏడుకోట్ల ఫాలోవర్లను సంపాదించుకుని మరో మైలురాయి దాటిన ప్రధానికి నా శుభాకాంక్షలు. మీ నాయకత్వంతో మేం గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్‌ చేశారు.