క్షీణించిన ఎంపీల ఆరోగ్యం… దీక్ష భగ్నం చేసిన పోలీసులు !

Police Destroy YSRCP MP's Hunger Strike then shifted to Hospital

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఢిల్లీ లో ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసిపి ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆరోగ్యం పరిస్థితి మీద తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఈ ఇద్దరు యువ ఎంపీల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో దీక్షలో ఉన్న ఎంపీలకు రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు పరీక్షలు జరిపారు. వీరిద్దరి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలను ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ ఎంపీలు మాత్రం మొండిగా దీక్షలోనే కూర్చొన్నారు. దీంతో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు జరిపిన పరీక్షలలో అవినాష్‌రెడ్డి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 73కు పడిపోగా, బిపి లెవల్స్‌ 80/60 మధ్య ఉన్నాయి, మిథున్‌రెడ్డి బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌ 71కి పడిపోతే ఆయన బిపి లెవల్స్‌ 110/70గా ఉన్నాయి. ఎంపీల శరీరంలోని కీటోన్స్‌ సంఖ్య కూడా ప్రమాదకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎంపీ మిథున్‌రెడ్డి అల్సర్‌తో కూడా బాధపడుతున్నారు. షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోయిన నేపథ్యంలో ఇద్దరు యువ ఎంపీలు దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరమని, శరీరంలోని ఇతర అవయవాలు, మెదడుపై ప్రభావం చూసే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే దీక్ష విరమించాలని ఎంపీలను కోరినట్టు వారు తెలిపారు.

ఇద్దరు ఎంపీలు డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, తక్షణం ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్‌ ఎక్కించాల్సిన అవసరముందని ఆర్‌ఎంఎల్‌ వైద్యులు సూచించారు. కానీ ఎంపీలు తమ దీక్ష విరమించేది లేదంటూ వైద్యుల సూచనను తిరస్కరించారు. దీంతో వైద్యులు ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు ఎంపీలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వారిని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఎంపీలను ఆస్పత్రికి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. అయితే వారి మధ్య స్వల్ప వాగ్వాదం జరుగగా ఎట్టకేలకి వారిని పక్కకి తప్పించి వారిని ఎంపీలను బలవంతంగా ఆస్పత్రికి తరచారు.