విషమంగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ‌ ఆరోగ్యం

విషమంగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ‌ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా ముఖర్జీ ప్రార్ధించారు. తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘గతేడాది ఆగష్టు 8న నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మా నాన్న భారత రత్న అవార్డును అందుకున్నారు. కానీ సరిగ్గా సంవత్సరానికి ఆగష్టు 10న ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. మా తండ్రికి ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మా నాన్న ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతున్న‌వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు’ అని షర్మిష్టా బుధవారం ట్వీట్‌ చేశారు.

సోమవారం ప్రణబ్‌కు బ్రెయిన్‌‌‌‌ సర్జరీ జరిగింది. బ్రెయిన్‌‌‌‌లో బ్లడ్‌‌‌‌ క్లాట్‌‌‌‌ కావడంతో ఆపరేషన్‌‌‌‌ చేసిన ఆర్మీ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ రిఫరల్‌ ‌‌‌హాస్పిటల్‌‌‌‌ డాకర్లు దానిని తొలగించారు. బ్రెయిన్‌ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుల చూపించలేదని, అంతేగాక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని మంగళవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రణబ్‌ పూర్వీకుల గ్రామంలో గ్రామస్తులు మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకునేందుకు మంగళవారం మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు. కాగా ప్రణబ్‌ కోవిడ్‌ బారిన పడిన విషయాన్ని ఆయన కార్యాలయం సోమవారం ట్విటర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. 2012-2017 మధ్యకాలంలో ప్రణబ్‌‌‌‌ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు.