మళ్లీ అదృష్టంను పరీక్షించుకోబోతున్నాడు!

Producer Venugopal about driver ramudu movie

తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్‌ హీరోలుగా మారడం చాలా కామన్‌. అప్పట్లో రాజబాబు నుండి మొన్నటి ధన్‌రాజ్‌ వరకు కమెడియన్‌గా ఆకట్టుకుని హీరోలుగా ప్రయత్నాలు చేశారు. హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరు సక్సెస్‌ అయ్యారు, కొందరు మాత్రం ఫ్లాప్‌ అయ్యారు. కొందరు హీరోలుగా సక్సెస్‌ అయ్యి, కొన్నాళ్ల తర్వాత మళ్లీ కమెడియన్‌గా సెటిల్‌ అయ్యి పోతున్నారు. ఇక వారి దారిలోనే జబర్దస్త్‌ షకలక శంకర్‌ హీరోగా పరిచయం అయ్యాడు. ఈయన మొదటి చిత్రం ‘శంభో శంకర’ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం కంటే ముందు డ్రైవర్‌ రాముడు అనే చిత్రాన్ని శంకర్‌ చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగుతూ, జరుగుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది.

షూటింగ్‌ ప్రారంభం రోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఆ స్టిల్‌తోనే షకలక శంకర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. తప్పకుండా ఈ చిత్రంతో విజయాన్ని దక్కించుకుంటాడేమో అని అంతా భావించారు. రాజ్‌ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను నిర్మాత వేణుగోపాల్‌ తెలియజేశారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, త్వరలోనే సినిమా ఆడియోను విడుదల చేసి, సాధ్యమైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించాడు. సినిమాలో శంకర్‌ చాలా పరిణితి చెందిన నటుడిగా కనిపిస్తాడని, తప్పకుండా హీరోగా ఈ చిత్రంతో శంకర్‌కు బ్రేక్‌ వస్తుందనే నమ్మకం వ్యక్తం అయ్యింది. మొదటి సినిమాతో హీరోగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన శంకర్‌ ఈ చిత్రంతో అయినా అదృష్టం కలిసి వచ్చి సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.