పుల్వామా ఎటాక్…2500 మంది టార్గెట్ !

Pulwama Attack Is Targeted With 2500 Jawans

నిన్న జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కారు బాంబుతో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బలితీసుకున్నారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది శ్రీనగర్ వెళ్తుండగా కారులో దూసుకొచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. వెంటనే ఐఈడీ బాంబును పేల్చడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు సంభవించిన తర్వాత కాల్పుల శబ్దం వచ్చినట్టు సమాచారం. పేలుడు ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హైవేపై రాకపోకలను నిషేధించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఇటీవలి కాలంలో కశ్మీర్లో జరిగిన అతిపెద్ద బాంబు దాడి ఇదే కావడం గమనార్హం.

ఈ దాడి తమ పనేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పుల్వామా జిల్లాకు చెందిన ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి తెగబడినట్టు జైషే మహ్మద్ తెలిపింది. అవంతిపురలోని గోరిపుర ప్రాంతానికి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ చేరుకోగానే.. కార్లో దూసుకొచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు పేలుడు ఘటన సమయంలో 2500 మందికి పైగా జవాన్లు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. భద్రతా బలగాలకు భారీ స్థాయిలో నష్టం కలిగించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడినట్టు స్పష్టం అవుతోంది. కారును నడుపుకుంటూ వచ్చి, ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాదిని కాక్రపారాకు చెందిన ఆదిల్ అహ్మద్‌గా గుర్తించారు. నిజానికి సాధారణంగా ఒకేసారి వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌లో వెళ్తుంటారు. కానీ వాతావరణం బాగోలేకపోవడంతో రెండు రోజులపాటు జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసేశారు. దీంతో ఒకేసారి 2500 మందికిపైగా సిబ్బంది బయల్దేరారు. కాన్వాయ్ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జమ్మూ నుంచి శ్రీనగర్ బయల్దేరింది. చీకటిపడేలోగా భద్రతా సిబ్బంది శ్రీనగర్ చేరుకోవాల్సి ఉంది.

ఈలోపే వారిని పొట్టన పెట్టుకున్నాడు సూసైడ్ బాంబర్. అయితే ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఢిల్లీలో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, జవాన్ల సాహసంపై పూర్తి నమ్మకం ఉందని భారత్‌ లో అస్థిరత్వం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలని సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. జవాన్లపై జరిగిన దాడితో 130 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోతోందని.. దానికి దీటైన సమాధానం చెబుతామన్నారు.