అరుదైన రికార్డు సాధించిన తెలుగు తేజం

అరుదైన రికార్డు సాధించిన తెలుగు తేజం

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం నాటి క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ అకానా యమగూచిని ఓడించడం ద్వారా ఆమె.. సెమీస్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తద్వారా ఓ అరుదైన రికార్డు సింధు పేరిట నమోదైంది. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు నిలిచింది. తద్వారా విశ్వ క్రీడల్లో రెండుసార్లు క్వార్టర్‌ ఫైనల్స్‌, ఒకసారి సెమీస్‌ చేరిన మరో షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.

ఇక 2016లో జరిగిన గత రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టి.. గెలుపొంది.. ఆపై రజత పతకం గెలిచిన విషయం విదితమే. ప్రస్తుతం అదే రీతిలో.. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా 21-13, 22-20 వరుస గేమ్‌లలో యమగూచిని ఓడించి సత్తా చాటింది. స్వర్ణ పతకం సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ సన్నద్ధమవుతోంది. కాగా 2012 నాటి లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ సెమీస్‌ చేరుకుని, కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే.