నిర్మొహ‌మాటంగా మాట్లాడేస్తున్న రాహుల్…

Rahul Gandhi stakes claim to Prime Minister post

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ గానీ, ఆమె త‌న‌యుడు… ఆ పార్టీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు రాహుల్ గాంధీగానీ… గ‌తంలో ఎప్పుడూ మ‌న‌సులో మాట‌ల‌ను నేరుగా బ‌య‌ట‌కు వెల్ల‌డించేవారు కాదు… కానీ ఈ మ‌ధ్య రాహుల్ త‌న పంథా మార్చుకున్నాడు. రాజ‌కీయాల్లో త‌న అంతిమ ల‌క్ష్యం ఏమిటో… సూటిగానే వివ‌రించేస్తున్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 14 ఏళ్లు కావ‌డం… సుదీర్ఘ‌కాలం పాటు దేశ అత్యున్న‌త ప‌ద‌వి కోసం నిరీక్షించ‌డం… ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిన ప్ర‌ధాని పీఠం… ప్ర‌స్తుతం దేశంలో మోడీ హ‌వా నెమ్మ‌దిగా త‌గ్గుతుండ‌డం వంటి ప‌రిణామాలు రాహుల్ ను నిర్మొహ‌మాటంగా మాట్లాడేలా చేస్తున్నాయి.

2004లో రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన‌ప్పుడు… ఆయ‌న అతిత్వ‌ర‌లోనే ప్ర‌ధాని పీఠాన్ని అధిరోహించ‌డం ఖాయ‌మని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డిచాయి. కానీ యూపీఏ ప్ర‌భుత్వం తొలి హ‌యాంలో ఎప్పుడూ రాహుల్ ప్ర‌ధాని ప‌ద‌వికి చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. త‌ర్వాత 2009లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష బీజేపీ బ‌ల‌హీనంగా ఉన్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్సే మ‌ళ్లీ అధికారంలోకి రానుందని… ఈ సారి రాహుల్ త‌ప్ప‌క ప్ర‌ధాని ప‌ద‌వి స్వీక‌రిస్తార‌ని విశ్లేష‌ణ‌లు సాగాయి. కానీ ఎందుకనో… రెండోసారీ కుమారున్ని ప్ర‌ధానిగా చూసేందుకు సోనియా ఆస‌క్తిచూప‌కుండా… ఆ ప‌ద‌విలో మ‌న్మోహ‌న్ సింగ్ నే కొన‌సాగించారు. రాహుల్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత 2014లో జ‌రిగిన మూడో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గ‌న‌క గెలిచి ఉంటే… నిస్సందేహంగా రాహుల్ చిర‌కాల వాంఛ తీరేదే. కానీ ప‌దేళ్ల పాల‌న‌లో ఎదురయిన వైఫ‌ల్యాలు, మోడీ హ‌వా… రాహుల్ కు ఆ అవకాశాన్ని దూరంచేశాయి.

అయితే ఎన్నిక‌ల‌ప్పుడు… ఎన్నిక‌ల త‌ర్వాత మూడేళ్ల పాటు దేశంలో ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే… ప్ర‌ధాని కావాలన్న రాహుల్ క‌ల 2019లో కూడా నెర‌వేర‌ద‌న్న భావ‌న నెల‌కొంది. కానీ ఏడాది కాలంగా ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా కేంద్ర‌ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌, మోడీకి త‌గ్గుతున్న ప్ర‌జాదర‌ణ కాంగ్రెస్ లోనూ, రాహుల్ లోనూ కొత్త ఆశ‌లు చిగురింప‌చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు రాహుల్… త‌న మ‌న‌సులో మాట స్వేచ్ఛ‌గా వెల్ల‌డిస్తున్నారు. ప్ర‌ధాని కావాల‌న్న త‌న ఆకాంక్ష‌ను వ్య‌క్తీక‌రిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు అధికారం నిల‌బెట్టేందుకు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్న రాహుల్… ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప‌ద‌విపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా వ్య‌వ‌హ‌రిస్తే… తానే ప్రధాని అవుతాన‌ని అన్నారు. మీరే ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌డ‌తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు… అది పార్టీ విజ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, ఒక‌వేళ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రిస్తే తానే ప్ర‌ధాని అవుతాన‌ని స‌మాధాన‌మిచ్చారు. గ‌త నెల‌లో రాహుల్ ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించ‌ద‌ని, చివ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసి నుంచి ఓడిపోయే అవ‌కాశ‌ముంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తిపక్షాలు అన్నీ ఒక్క‌టై బీజేపీని ఓడిస్తాయ‌న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా వ్య‌వ‌హ‌రిస్తే… తాను పీఎం అవుతానంటున్నారు. అంటే రాహుల్ కు బీజేపీ ఖాయంగా ఓడిపోతుంద‌న్న న‌మ్మ‌కమైతే ఉంది కానీ… కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందా లేదా అన్న‌దానిపై సందేహం ఉన్నట్టు ఆయ‌న వ్యాఖ్య‌లు తెలియ‌జేస్తున్నాయి.