యువ ఐఏఎస్ ల ప్రేమ పెళ్లిపై రాహుల్ గాంధీ రియాక్ష‌న్….నెటిజ‌న్ల ఆగ్ర‌హం

Rahul Gandhi’s congratulatory tweet for IAS couple

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశ‌వ్యాప్తంగా అంద‌రిదృష్టినీ ఆక‌ర్షించిన యువ ఐఏఎస్ లు టీనాద‌బీ, అథ‌ర్ అమిర్ ఉల్ ష‌ఫీ ప్రేమ వివాహంపై కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. టీనా ద‌బీ..అథ‌ర్ అమిర్ ప్రేమ‌బంధం మ‌రింత బ‌లోపేతం కావాల‌ని ఆకాంక్షిస్తూ ట్విట్ట‌ర్ లో వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అస‌హ‌నం, విద్వేషం పెరిగిపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వారు భారతీయులంద‌రికీ స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాన‌ని, గాడ్ బ్లెస్ యూ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ద‌ళిత కుటుంబానికి చెందిన 24 ఏళ్ల టీనా ద‌బీ 2015 సివిల్స్ లో మొద‌టి ర్యాంకు సాధించింది. ఆ ఎగ్జామ్స్ లో త‌న త‌ర్వాతి ర్యాంకు సాధించిన క‌శ్మీర్ యువ‌కుడు అథ‌ర్ అమిర్ ఉల్ ష‌ఫీని టీనా ప్రేమించి పెళ్లిచేసుకుంది. త‌న ప్రేమ విష‌యం ఆమె 2016లోనే వెల్ల‌డించింది. తాను తొలిచూపులోనే అమిర్ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు, త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించిన‌ట్టు తెలిపింది.

ప్రేమ విష‌యం టీనా తెల‌ప‌గానే..అప్ప‌ట్లో ప‌త్రిక‌ల‌న్నీ ఆ వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. సివిల్స్ సెకండ్ ర్యాంక‌ర్ ప్రేమ‌లో ఫస్ట్ ర్యాంక‌ర్ అన్న శీర్షిక‌ల‌తో ప్ర‌త్యేక క‌థ‌నాలు రాశాయి. కానీ…త‌ర్వాత వారి ప్రేమ‌పై వివాదం చెల‌రేగింది. హిందూ కుటుంబానికి చెందిన టీనా ముస్లిం వ్య‌క్తిని ప్రేమించ‌డంపై హిందూ సంస్థ‌లు అనుమానాలు వ్య‌క్తంచేశాయి. ఇది ల‌వ్ జీహాద్ అని ఆరోపిస్తూ సాక్షాత్తూ హిందూ మ‌హాస‌భ జాతీయ కార్య‌ద‌ర్శి మున్నాకుమార్ శ‌ర్మ టీనా తండ్రికి లేఖ రాశారు. టీనా, అథ‌ర్ అమిర్ వివాహ నిర్ణ‌యంపై పున‌రాలోచించుకోవాల‌ని కోరారు. హిందూ మ‌హాస‌భ‌తో పాటు మ‌రికొన్ని వ‌ర్గాలు కూడా టీనా, అమిర్ ప్రేమ‌ను త‌ప్పుబ‌ట్టాయి. వారిద్ద‌రు మాత్రం ఈ విమ‌ర్శ‌లను, వ్య‌తిరేక‌త‌ను ప‌ట్టించుకోకుండా…గ‌త శ‌నివారం జ‌మ్మూ కాశ్మీర్ లోని ప‌హెల్ గాంలో వివాహం చేసుకున్నారు.

ప‌లు ప‌త్రిక‌లు…వారి పెళ్లిఫొటోలను ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. అనేక‌మంది కొత్త జంట‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఆదర్శంగా నిలిచార‌ని కొనియాడుతున్నారు. అదే క్ర‌మంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా నూత‌న దంప‌తుల‌కు విషెస్ చెప్పారు. అయితే..నెటిజ‌న్లు మాత్రం రాహుల్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. రాహుల్ టీనాద‌బీ, అథ‌ర్ అమిర్ ప్రేమ వివాహాన్ని కూడా రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. రాహుల్ కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో సరిపెట్టకుండా…అస‌హ‌నం, విద్వేషం వంటి ప‌దాలు ప్ర‌యోగించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

netizens fires on Rahul Gandhi