చిక్కుల్లో అమితాబ్ ఫ్యామిలీ

చిక్కుల్లో అమితాబ్ ఫ్యామిలీ

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల లీకేజీ కేసు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని చుట్టుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు అభిషేక్ బచ్చన్ హాజరుకాగా… తాజాగా ఆయన భార్య, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది. ఐశ్వర్య రాయ్‌కు ఈడీ గతంలోనూ సమన్లు జారీ చేయగా అప్పుడు వాయిదా కోరింది. అయితే ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వారు ప్రశ్నల జాబితాను తయారుచేసుకున్నట్టు సమాచారం.

తన కూతురు ఆరాధ్య బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మాల్దీవులు వెళ్లిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ ఈ మధ్యే ఇండియాకు వచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంతలోనే ఈడీ ఐశ్వర్య రాయ్‌కు షాక్ ఇచ్చింది. అయితే తాజా విచారణను కూడా వాయిదా వేయాలని ఐశ్వర్య ఈడీని కోరినట్లుగా తెలుస్తోంది. పనామా దేశానికి చెందిన మొసాక్‌ ఫోన్సెకా అనే కార్పొరేట్‌, న్యాయ సేవల సంస దేశదేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో ఐసీఐజే బట్టబయలు చేసింది.

ఈ కేసులో మన దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు ఉండడంతో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో భారత్‌కు చెందిన 500 మందికి ప్రేమయం ఉన్నట్టు సమాచారం. ఇందులో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌తో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరంతా పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాను భారతీయ నిబంధనల ప్రకారమే విదేశాలకు డబ్బు పంపినట్టు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పనామా పేపర్స్‌లో కనిపించిన కంపెనీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు ఇదే కేసులో అభిషేక్, ఐశ్వర్య రాయ్‌లను ఈడీ విచారిస్తుండటం ఆసక్తికరంగా మారింది.