రాజమౌళితో పాటు ఆ చౌదరి ఓకే అంటేనే …

Rajamouli Raghavayya Chowdary give plan to Amaravati design

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏదైనా విషయంలో ఒప్పించడం అంత తేలిక కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న ఆయన ఐఏఎస్ అధికారులు ఇచ్చే సూచనలు, సలహాల్లో కూడా తప్పొప్పులు అంచనా వేసి అప్పటికప్పుడు సరిదిద్దిన సందర్భాలు వున్నాయి. ఇక నాయకులు ఇచ్చే సలహాల విషయంలో కూడా బాబు చాలా జాగ్రత్తగా వుంటారు. అయితే ఇప్పుడు బాబు గారు ఒక్క చౌదరి గారి మాట మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారట. చౌదరి అంటే కేంద్రమంత్రి సుజనా చౌదరి అనుకుంటారేమో. కానే కాదు. ఆయన పేరు రాఘవయ్య చౌదరి. రాజకీయాల్లో ఎప్పుడూ ఈ పేరు వినబడలేదు అనుకుంటున్నారా? నిజమే. ఈయనకి రాజకీయాలతో ఏ సంబంధం లేదు. ఇంతకీ ఆయన ఎవరంటే… బాబు గారి కుటుంబ వాస్తు సిద్ధాంతి.

ఈ రాఘవయ్య చౌదరి గారు వాస్తు విద్వత్తుతో తమ క్యాంపు లోకి వచ్చినప్పటినుంచి అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం బాబుగారిలో ఏర్పడింది అట. అందుకే హెరిటేజ్ సంస్థ కార్యాలయాలు, సొంత ఇల్లు సహా అమరావతి లో ప్రతి నిర్మాణానికి సంబంధించి రాఘవయ్య చౌదరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పని ముందుకు కదులుతోంది. ఈ మధ్య వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో గేటు మార్పుకి సంబంధించి కూడా రాఘవయ్య గారి మాటే చెల్లిందట. ఇక నార్మన్ ఫోస్టర్ డిజైన్స్ చూసేందుకు కూడా ఇప్పటికే ఓ సారి రాఘవయ్య చౌదరి లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాజమౌళి వెళ్లి ఏదైనా డిజైన్స్ కి ఓకే చెప్పినా ఆ చౌదరి గారు రంగంలోకి దిగి వాస్తు పరంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ అమరావతి పనులు ముందుకు కదలవట. ఈ పరిణామాల్ని ప్రభుత్వ పెద్దలు నమ్మకం అనుకుంటున్నా ఈ ప్రాసెస్ లో భాగస్వాములు అవుతున్న సీనియర్ అధికారులకి మాత్రం ప్రైవేట్ వ్యక్తుల హవా ఇబ్బందిగా ఉందట. అయినా సీఎం గారే చౌదరి గారి మాట వింటుంటే ఇక మిగిలిన వాళ్ళు ఏమి మాట్లాడగలరు ?