వేములవాడ రాజన్నకి కార్తీక శోభ

వేములవాడ రాజన్నకి కార్తీక శోభ

వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. నెల రోజులపాటు స్వామివారు భక్తుల విశేష పూజలందుకుంటారు. ఆదివారం అమావాస్య అయినప్పటికీ రాజన్నను దర్శించుకునేందుకు 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి, మొక్కు తీర్చుకున్నారు. కోవిడ్‌–19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు విఠలేశ్వర స్వామికి శ్రీకృష్ణతులసీ కల్యాణం జరిపిస్తున్నట్లు స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ తెలిపారు.

28న వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకుని శ్రీఅనంతపద్మనాభ స్వామి వారికి 12 మంది రుత్విజులతో మహాభిషేకం జరపనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ, పొన్నసేవపై స్వామివార్లకు ఊరేగింపు, రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, 10.30 గంటలకు స్వామివారి నిషిపూజ అనంతరం మహాపూజ ఉంటుందన్నారు.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం స్వామివారి సన్నిధిలో నిత్యపూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ధనలక్ష్మీ పూజ ఘనంగా జరిపించారు. అనంతరం శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వార్ల ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.