కమల్ హాసన్‌ తో నా స్నేహాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు: రజనీకాంత్

కమల్ హాసన్‌ తో నా స్నేహాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు: రజనీకాంత్

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన చిరకాల స్నేహితుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు మద్దతు ఇచ్చారు. కమల్‌ను వెనకేసుకొస్తూ కొందరు రాజకీయ నాయకులకు కౌంటర్ వేశారు. కమల్ హాసన్ ఇటీవల తన 65వ బర్త్‌డే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 60 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉంగళ్ నాన్ అనే వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు కమల్ హాసన్‌తో పాటు రజనీకాంత్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా రజనీ స్టేజ్‌పై కమల్‌కు మద్దతు ఇస్తూ పలువురు రాజకీయ నాయకులకు వేసిన కౌంటర్ వైరల్ అవుతోంది.

ఇంతకీ రజనీ ఏమన్నారంటే.. ‘ఎన్నో ట్యాలెంట్లు కనబరిచే ప్రతిభ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్‌కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. 60 ఏళ్లు ఆయన సినీ పరిశ్రమలో ఉన్నాడంటే అది అంత సులువు కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. నేను సినిమాల్లోకి రాకముందు కండక్టర్‌గా పనిచేశాను. నేనూ ఎన్నో కష్టాలు పడ్డాను కానీ కమల్ అంత కాదు. కమన్ నటన చూసి నేనెప్పుడూ సంతోషించేవాడిని. కమల్ నేర్చుకున్నది, తెలుసుకున్నదే ప్రజలకు చెబుతుంటారు. కానీ ఆయన మాటలు అర్థంకావని చాలా మంది అనడం నేను చూశాను. నిద్రపోతున్న వాడిని లేపచ్చు’

‘కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్నవారిని ఏమీ చేయలేం. కమల్ మాటలు నాకు అర్థం అవుతున్నప్పుడు మిగతా వారికి ఎందుకు అర్థం కావు. మా మధ్య స్నేహాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు. మా అభిమానులు కూడా ఇలాగే స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నాను. రెండేళ్ల క్రితం తాను ముఖ్యమంత్రి అవుతాడని పళనిస్వామి కలలో కూడా ఊహించి ఉండరు. కానీ ఆయన అయ్యారు. ఆయన ప్రభుత్వం నాలుగు నెలల్లో కూలిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఏదో అద్భుతం జరిగినట్లు ఆయన పాలన అందరికీ నచ్చింది. అద్భుతాలు నిన్న జరిగాయి, ఈరోజు జరుగుతున్నాయి, భవిష్యత్తులోనూ జరుగుతాయి’ అని వెల్లడించారు రజనీ. అయితే ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో ఆయనకే తెలియాలి.