విచారణకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

విచారణకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను శుక్రవారం ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) వెల్లడించింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంలో విచారణ చేపట్టిన ఎన్‌సీబీ..బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై దర్యాప్తుచేస్తుండటం తెల్సిందే. ఎన్‌సీబీ పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపింది.

అయితే, ఆ సమన్లు హైదరాబాద్‌లోగానీ, ముంబైలోగానీ తనకు అందలేదంటూ గురువారం ఉదయం రకుల్‌ ప్రకటించారు. దీంతో, ఫోన్‌తోపాటు వివిధ మార్గాల్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సమన్లు అందుకున్నట్లు ఆమె ధ్రువీకరించారని అనంతరం ఎన్‌సీబీ అధికారి ఒకరు చెప్పారు. శుక్రవారం రకుల్‌ విచారణలో పాల్గొంటారని కూడా ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా, శనివారం జరిగే ఎన్‌సీబీ విచారణలో పాల్గొనేందుకు దీపిక గురువారం రాత్రి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ఆమె ఇంటివద్ద ముందు జాగ్రత్తగా ముంబై పోలీసులు బందోబస్తు పెంచారు. దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ శుక్రవారం విచారణలో పాల్గొననున్నారు.

ఎన్‌సీబీ నోటీసులందుకున్న మరో నటి సారా అలీఖాన్‌ గురువారం సాయంత్రం గోవా నుంచి ముంబై జుహులోని తన సొంతింటికి చేరుకున్నారు. దీపిక, శ్రద్ధా కపూర్‌తోపాటు ఈమె కూడా శనివారం ఎన్‌సీబీ ఎదుట హాజరుకానున్నారు. సుశాంత్‌ సింగ్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి విచారణలో వెల్లడించిన సమాచారంలో రకుల్, సారాల ప్రస్తావన కూడా ఉందని అంతకుముందు ఎన్‌సీబీ పేర్కొంది. గురువారం ఉదయం ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్టాతోపాటు సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీ ముంబైలోని ఎన్‌సీబీ గెస్ట్‌ హౌస్‌లో విచారణకు హాజరయ్యారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.