ఎయిర్ పోర్ట్ లో తార‌క్, చెర్రీ… వీడియో వైర‌ల్

Ram Charan and NTR at Airport
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న‌యితే రాలేదు కానీ… బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ మాత్రం వేగంగా జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి తార‌క్, చెర్రీపై ఫొటో షూట్ నిర్వ‌హించ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ ఫొటో షూట్ జ‌రిపేది ఇండియాలో కాదు… అమెరికాలోన‌ని తెలుస్తోంది. తారక్, చెర్రీ క‌లిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క‌నిపించ‌డం ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తోంది. చెరో బ్యాగ్ త‌గిలించుకుని… ఎయిర్ పోర్ట్ లో ఇద్ద‌రూ స‌ర‌దాగా ముచ్చ‌టించుకుంటున్న ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

సినిమాకు సంబంధించి వ‌ర్క్ షాప్ ను అమెరికాలో నిర్వ‌హించ‌నున్న రాజ‌మౌళి… అక్క‌డే ఇద్ద‌రు హీరోల‌పై ఫొటో షూట్ ను కూడా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. సినిమా ఎనౌన్స్ మెంట్ స‌మ‌యంలో ఈ ఫొటోలు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందుకోస‌మే ఇద్ద‌రూ అమెరికా వెళ్లార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలంటున్నాయి. తార‌క్, చెర్రీ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే రాజ‌మౌళి సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌రణ్ న‌టించిన రంగ‌స్థ‌లం షూటింగ్ పూర్తిచేసుకుని ఈ నెల 30న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా… ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. బోయ‌పాటి, త్రివిక్ర‌మ్ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే రాజ‌మౌళి త‌న సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు.