స్వతంత్ర పోరాటంలోకి దూకుతున్న ఎన్టీఆర్,చరణ్.

Ram Charan and NTR Multistarrer movie Story

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి చేస్తున్న సినిమా కథ ఏంటి అన్నదానిపై ఇప్పటికే చాలా ఊహాగానాలు వచ్చాయి. ముందుగా బాక్సర్లు అయిన ఇద్దరు అన్నదమ్ముల కథ అని ప్రచారం జరిగింది. కానీ అసలు కథ ఏంటో డైరెక్టర్ రాజమౌళి చూచాయగా కూడా చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన ఊహలకు రెక్కలు వచ్చాయి. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. తాజాగా ఈ సినిమా గురించి ఇంకో లీక్ బయటకు వచ్చింది. అయితే ఇది ఉట్టి ఊహాగానం కాదని, రాజమౌళి యూనిట్ నుంచి బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఆ విషయంలో నిజం వుందో, లేదో కానీ బయటకు వచ్చిన మ్యాటర్ లో గట్టి డెప్త్ కనిపిస్తోంది.

ఎన్టీఆర్,  రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సబ్జెక్టు స్వాతంత్ర్య ఉద్యమ కాలానికి సంబంధించిందని తెలుస్తోంది. అప్పటి పరిస్థితుల్లో ఉద్యమానికి దన్నుగా నిలిచి బ్రిటిష్ వారిపై పోరాడిన ఇద్దరు వీరుల కథ తో రాజమౌళి సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని చారిత్రిక అంశాలపై రాజమౌళి అండ్ టీం గట్టి కృషి చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం విజయేంద్ర ప్రసాద్ అందించిన మూల కధకి చిత్రిక పట్టేందుకు పనిచేస్తున్న రాజమౌళి టీం సభ్యుడు ఒకరు ఈ విషయాల మీద నోరు విప్పినట్టు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బాహుబలి తర్వాత రాజమౌళి కొత్త సినిమా ప్రకటన చేసేదాకా ఇలాంటి ప్రచారాలు చాలా జరిగాయి. ఇప్పుడు కూడా రాజమౌళి చిత్ర కథ మీద ఓ క్లారిటీ ఇచ్చేదాకా ఇంతే.