పీఆర్వోల మీటింగ్‌ ఇన్ని తీర్మానాలు… జరిగే పనేనా ?

Tollywood PRO Meetings

ఎప్పుడూ లేనిది టాలీవుడ్ పీఆర్వోలంతా ఏక‌మ‌వ్వ‌డం, అందరూ కలిసి మీటింగ్‌ పెట్టుకోవ‌డం అందరిలోనూ ఆస‌క్తిని రేకెత్తించింది. పీఆర్వో సంప్రదాయం ఎప్పటి నుండో ఉన్నా ఇప్పుడిప్పుడే అది కార్పోరేట్ లుక్ సంతరించుకుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో పీఆర్వోలు ఎక్కువ‌వ్వ‌డం, వాళ్ల‌కు ప్రాధాన్య‌త పెర‌గ‌డం, వాళ్ల‌లో వాళ్ల‌కు కొన్ని గ్రూపులు ఏర్ప‌డ్డం వ‌ల్ల‌ అందరూ కలిసి ఒక తాటి మీదకు వచ్చే ప్రయంతంలో భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ కి చెందిన దాదాపు 30 మంది పీ ఆర్ ఓ లు ఈ మీటింగుకి హాజ‌ర‌య్యారు. అయితే ఈ మీటింగ్ లో పలు  నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. చిత్ర రంగంలో ప్రస్తుతానికి 24 క్రాఫ్టులున్నాయి. 25వ క్రాఫ్టుగా జ‌ర్న‌లిస్టుల్ని చేర్చాల‌ని, అందులో పీఆర్వోల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌న్న‌ది సమావేశం ప్ర‌ధాన అజెండాగా చెబుతున్నారు. పీఆర్వోల‌లో గ్రూపులు ఏర్ప‌డ్డాయ‌ని బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని, ఒక‌ట్రెండు సినిమాలు చేసి `మేం కూడా పీఆర్వోల‌మే` అని చెప్పుకుంటున్న‌వాళ్ల‌ ప్రచారాలను తిప్పికొట్టడం లాంటివి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.
ఇప్పుడు ఎవరు పీఆర్వో అవ్వలన్నా కొన్ని రూల్స్ ని సమావేశంలో నిర్ణయించుకున్నారు.
రూల్స్

వాటి ప్రకారం గ‌త రెండేళ్లలో క‌నీసం రెండు సినిమాలు చేసి, ప్ర‌స్తుతం చేతిలో క‌నీసం ఒక్క సినిమా అయినా ఉన్న వాళ్ల‌కే ఈ పీఆర్వో సంఘంలో స‌భ్య‌త్వం దొరుకుతుంది. అలాగే ఎవరయినా కొత్త‌గా పీఆర్వో మెంబ‌ర్ షిప్ కావాల‌నుకుంటే, ఏదైనా ఓ పీఆర్వో ద‌గ్గ‌ర ప‌ది సినిమాల‌కు అసోసియేట్‌గా ప‌నిచేసి, సొంతగా పీఆర్వోగా క‌నీసం 5 సినిమాలు చేయాలి. అలాంటి వాళ్ల‌కే మెంబ‌ర్ షిప్ ద‌క్కుతుంది.

ఇదే కార్య వర్గం
అధ్య‌క్షుడు : బిఏ రాజు,
ఉపాధ్య‌క్షులు : ఎల్. వేణుగోపాల్‌, సురేష్ కొండేటి,
ప్రధాన కార్యదర్శి : మాధురి మధు,
జాయింట్ సెక్రెటరీస్ : వంశి కాకా, ఏలూరు శ్రీను
కోశాధికారి : గాండ్ల శ్రీను

ఈ కార్యవర్గాన్ని ఎటువంటి ఎన్నికలు లేకుండా ఏక‌గ్రీవంగా ఎంచుకున్నారు. అయితే మ‌రో మూడు నెల‌ల్లో అసోసియేష‌న్‌కి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, అప్పుడు కొత్త కార్య‌వ‌ర్గాన్ని ఎంచుకోవాల‌ని పీఆర్వో అసోసియేష‌న్ ఓ తీర్మాణానికి వచ్చింది. దీంతో తెలుగులో కూడా నిర్దిష్టమయిన పీఆర్వో వ్యవస్థ ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్టు పీఆర్వోలలో గ్రూప్ లు ఉన్న మాట వాస్తవమే అయితే అవేమీ పెద్ద పెద్ద విషయాల వల్ల కలిగినవి కాదు. అయితే ఇప్పుడు ఈ తీర్మానాలకి అందరూ తలోగ్గుతారా ? లేదా అనేది తేలాల్సిఉంది.