ఉండవల్లి రివర్స్ గేర్ వెనుక బాబు గేమ్ ప్లాన్ అదుర్స్.

Undavalli-Arun-Kumar-meets-

ఉండవల్లి అరుణ్ కుమార్… ఈయన గారు నిద్రలోనే కాదు చివరకు కలలో సైతం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడతారని వేరే చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఇప్పుడు అమరావతి రావడమే కాదు విభజన సమస్యల మీద మోడీ సర్కార్ తో పోరాటం చేస్తున్న చంద్రబాబుకి తనకు తెలిసిన అస్త్రశస్త్రాలు అందించడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పట్టిసీమ సహా టీడీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద ఎన్నో సందర్భాల్లో ఉండవల్లి గొంతు విప్పారు. సీఎం చంద్రబాబుతో ముఖాముఖీ చర్చలకు సవాల్ విసిరారు. అయితే ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి కింది స్థాయి నేతలను వాడుకున్న చంద్రబాబు నేరుగా ఉండవల్లి మీద విమర్శలకు స్పందించిన దాఖలాలు లేవు. అలాంటి ఉండవల్లిని సీఎం పేషీ అధికారులు ముఖ్యమంత్రితో చర్చలకు ఆహ్వానించడం చాలా మంది లాగే ఉండవల్లిని కూడా షాక్ కి గురి చేసింది. అయితే వెంటనే తేరుకున్న ఉండవల్లి తప్పనిసరి పరిస్థితుల్లో అమరావతి వచ్చారు. బాబుతో భేటీ అయ్యి ఆయనకు అవసరం అనుకున్న సమాచారం ఇచ్చారు. వ్యూహాల గురించి చర్చించారు.నిజానికి ఈ ఎపిసోడ్ లో ఉండవల్లి హైలైట్ అయినప్పటికీ సీఎం చంద్రబాబు గేమ్ ప్లాన్ అదిరిపోయింది.

ప్రధాని మోడీ మీద విభజన సమస్యల మీద పోరాటంలో సీఎం చంద్రబాబు అన్ని మొహమాటాలు పక్కనబెట్టారు. ఈ విషయంలో జనానికి పెద్దగా సందేహాలు లేవు. పైగా మోడీ తో జగన్, పవన్ లాలూచీ పడుతున్నారన్న విషయాన్ని కూడా బాబు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అయితే తాజాగా ” సంపర్క్ సమర్ధన్” కార్యక్రమంలో భాగంగా బీజేపీ జీతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ లో ఈనాడు సంస్థల అధినేత రామోజీని కలవడం తో మళ్లీ టీడీపీ, కమలనాధులతో కలుస్తుందన్న ప్రచారం మొదలెట్టింది వైసీపీ. ఆ పార్టీ నేత బొత్స ఇంకో అడుగు ముందుకు వెళ్లి చంద్రబాబు రాజగురువు రామోజీతో అమిత్ షా భేటీ గుట్టు విప్పాలని డిమాండ్ కూడా చేశారు. కమలనాధులు కావాలనే ఇలాంటి చర్యలతో తన విశ్వసనీయత దెబ్బ తీయాలి అనుకుంటున్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు వెంటనే ఇంకో గేమ్ ప్లాన్ వేశారు.

రామోజీ పేరు ముందుకు రాగానే తలవని తలంపుగా మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లి ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. ఆయన చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి అని తెలుసు. కానీ విభజన సమస్యల మీద రాష్ట్ర సర్కార్ కి తనకు చేతనైన సాయం చేస్తామని ఉండవల్లి ముందుకు వచ్చారు. గతంలో ఉండవల్లి చేసే ఇలాంటి ప్రతిపాదనల్ని ఏ మాత్రం లెక్క చేయని చంద్రబాబు ఈసారి ఒడుపుగా ఆ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఆయన్ని చర్చలకు పిలిచారు. ఆయన చర్చలకు వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితో అయినా కలిసి పనిచేస్తారన్న సంకేతం వెళుతుంది. ఒకవేళ ఉండవల్లి చర్చలకు రాకుంటే ఆయనే ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. బాబు వేసిన ఈ గేమ్ ప్లాన్ అర్ధం అయ్యాక ఉండవల్లికి అమరావతి రాక తప్పలేదు.