విందు రాజకీయం….బాబు-రామోజీ-కేసీఆర్ ల రహస్య భేటీ ?

రామోజీరావుతో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. వీరిభేటీ హఠాత్తుగా నిర్ణయమైనట్లు సమాచారం. భేటీ కోసమే చంద్రబాబు అమరావతి నుండి హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుండి రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళారు. ఎలాగైనా రాహుల్ ను ప్రధానిని చేయాలి. అంతకన్నా కీలకం మోడీని గద్దెదించాలి. అంతేకాక తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ను దారిలోకి తెచ్చుకోవాలి. ఇక కేసిఆర్ తో వైరం ఎంతమాత్రం పనికిరాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా ఎత్తేసింది. లోకసభ ఎన్నికలకు ఒక్క సీట్లో కూడా పోటీ చేయలేదు. అలాగే జిల్లా పరిషత్, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా దూరంగా ఉంది. ఒకవైపు టిడిపి ఓడిపోతోందని ప్రచారం, మరోవైపు కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడినే ప్రధాని అవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలో పొరపాటున ఆంధ్రలో జగన్ వచ్చేస్తే? ఎటూ తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు తెరాసకే వెళ్తాయనే అనుకొవాలి. ఇప్పుడు జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేయగల నేతగా బాబుకు పేరుంది, ఈ క్రమంలో ఈ కీలక సమయంలో లో తెరాసతో మంచిగా వుండడం అన్నివిధాలా అవసరం. తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కేంద్రంలో అధికారం సాధించాలనుకుంటున్న కాంగ్రెస్కు కావచ్చు అందరికీ ఇప్పుడు తెరాస తెచ్చే సీట్లతో పనుంది. మోడీకి ఏమాత్రం సీట్లు తగ్గినా కేసిఆర్ ను ఇటు లాగడం ద్వారా, తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే రామోజీతో భేటీకి ప్రాధాన్యత పెరిగింది.