అరణ్య సినిమాతో అవగాహన పెంచుకుందాం

అరణ్య సినిమాతో అవగాహన పెంచుకుందాం

భల్లాల దేవుడు రానా దగ్గుబాటి తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అరణ్య’ సంబంధించి తన అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్తను షేర్ చేశారు. త్వరలోనే అరణ్య సినిమా థియేటర్లను పలకరించనుందని ప్రకటించారు. నిరీక్షణ ఇక చాలు..‘అరణ్య’ సినిమాను 2021 సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రస్తుతం కోవిడ్ మహమ్మారిపై మన పోరాటం.. మానవ విధ్వంసంపై అడవుల పోరును సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విధ్వంసం ఎప్పుడు ఆగుతుంది!? అరణ్య సినిమాతో అవగాహన పెంచుకుందాం అంటూ రానా కమెంట్ చేశారు.

రానా ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ రూపొందిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘అరణ్య’. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. జోయా హుస్సేన్, కల్కి కణ్మిణీ, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, శ్రియా పిలగోన్కర్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సాల్మన్ ప్రభు దర్శకుడు. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ పేరుతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. విలక్షణ పాత్రలతో తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న రానా ‘అరణ్య’లో కూడా అదే తరహాలో అలరించడం ఖాయం అంటున్నారు. అలాగే జంతు ప్రేమికుడు, నేషనల్ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ దర్శకత్వ ప్రతిభ, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’లాంటి సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన ప్రాణ స్టూడియో వీఎఫ్‌ఎక్స్‌ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని అంచనా. హాలీవుడ్ రేంజ్ లో అదరగొడుతున్న బీజీఎం ఈ అంచనాలను మరింత పెంచేస్తోంది.