సినిమాల్లోనే కాదు డార్లింగ్ నిజమైన హీరో

సినిమాల్లోనే కాదు డార్లింగ్ నిజామైన హీరో

సినిమా వాళ్లందరూ కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వానికి లక్షల్లో విరాళాలు అందిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కలిపి ఏకంగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చి ఔరా అనిపించాడు. పవన్ అంత ఉదారంగా వ్యవహరించడంతో మిగతా పెద్ద స్టార్లు కూడా తమ హృదయం కూడా విశాలమైందని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

చిరంజీవి, మహేష్ బాబు కూడా చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ రూ.75 లక్షలు, రామ్ చరణ్ రూ.70 లక్షల చొప్పున సాయం అందజేశారు. వీరి బాటలోనే ప్రభాస్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.కోటి విరాళం అందించినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్‌ది కూడా మిగతా వాళ్ల రేంజే అనుకున్నారు.

కానీ తర్వాత ప్రభాస్ విరాళం గురించి కొత్త అప్ డేట్ వచ్చింది. అతను కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.3 కోట్ల విరాళం అందజేస్తున్నట్లు వెల్లడైంది. అంటే మొత్తం రూ.4 కోట్ల విరాళం అన్నమాట. పవన్ రెండు కోట్లు ఇవ్వడమే గొప్ప అనుకుంటే దాని మీద రెట్టింపు విరాళంతో ప్రభాస్ అబ్బురపరిచాడు. సంపాదన, ఆస్తులు ఎంత ఉన్నా సరే.. ఒక హీరో రూ.4 కోట్ల విరాళం ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. అతణ్ని మించి ఆదాయం పొందుతున్న బాలీవుడ్ స్టార్లు అసలు ఈ కష్ట కాలంలో ప్రభుత్వానికి తోడ్పాటు అందించే ప్రయత్నమే చేయట్లేదు. తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు.

తెలుగు స్టార్లు మాత్రం ఒకరిని మించి ఒకరు విరాళాలు అందచేస్తున్నారు. అందరిలోకి ప్రభాస్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. బహుశా ప్రభాస్ రికార్డును నేషనల్ లెవెల్లో ఎవరూ బద్దలు కొట్టలేకపోవచ్చు. కరోనా సంక్షోభ వేళ సినీ తారల్లో అత్యధిక విరాళం అందించిన హీరోగా మన ‘బాహుబలి’ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.