వామన్‌రావు దంపతుల హత్య వెనుక అసలు కుట్ర

వామన్‌రావు దంపతుల హత్య వెనుక అసలు కుట్ర

తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడని, మంథనిలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధును ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే కసితో వామన్‌రావును హతమార్చాలని కుంట శ్రీనివాస్‌ కొంతకాలంగా వేచి చూస్తున్నాడు. గుంజపడుగులో గుడి వివాదం పెరగడంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడానికి వస్తాడనే ఉద్దేశంతో వారం నుంచి కోర్టు వద్ద రోజుకో మనిషిని ఉంచుతున్నాడు. అందులో భాగంగానే బుధవారం కూడా తన మనిషిని కోర్టు వద్ద ఉంచగా, వామన్‌రావు దంపతులు వచ్చిన విషయాన్ని 12.30 గంటల సమయంలో కుంట శ్రీనివాస్‌కు చేరవేసినట్లు తెలిసింది. అప్పటికే సీఎం జన్మదిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుతో పాటు పలు గ్రామాల్లో పాల్గొన్న శ్రీనివాస్‌ మంథనికి చేరుకున్నాడు. వామన్‌రావు వచ్చిన విషయం తెలిసిన వెంటనే మధు మేనల్లుడు.. బిట్టు శ్రీనును కలిసినట్లు తెలుస్తోంది.

వామనరావును చంపేందుకు అనువైన స్పాట్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు. వామన్‌రావు గుంజపడుగుకు వెళ్తే చంపాల్సిన స్పాట్‌తో పాటు హైదరాబాద్‌ వెళ్తే ఎక్కడ ప్రాణాలు తీయాలో స్కెచ్‌ వేశారు. బిట్టు శ్రీనుకు చెందిన నల్ల కారును హత్య కోసం వాడుకోవాలని నిర్ణయించుకుని, డ్రైవర్‌గా వీరికి నమ్మకస్తుడైన చిరంజీవిని పిలిపించారు. బిట్టు శ్రీనునే మంథనిలో కొడవళ్లు, కత్తులు అమ్మే దగ్గర రెండు కత్తులు కొని కారులో పెట్టాడు. మూడో నిందితుడు అక్కపాక కుమార్‌ను పిలిపించి తెల్ల కారును ఇచ్చి కోర్టు దగ్గర రెక్కీ కోసం పంపారు. మంథని చౌరస్తాలో నల్లకారుతో కుంట శ్రీనివాస్, చిరంజీవి వేచి ఉన్నారు. 2 గంటల సమయంలో వామనరావు కారు హైదరాబాద్‌కు బయల్దేరుతుందన్న సమాచారం కుమార్‌ నుంచి రాగానే కల్వచర్ల స్పాట్‌కు వెళ్లి కారు నిలుపుకొన్నారు. వామన్‌రావు కారు రాగానే నల్లకారు అడ్డుగా పెట్టి నరికేశారు.