Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనవరి 26 అనగానే రిపబ్లిక్ డే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజు సెలవు ఉంటుందని అందరికీ తెలుసు. అయితే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాం ? దాని వెనుక వున్న ఉద్దేశం ఏంటి అన్నది మాత్రం ఏ కొద్ది మందికో తెలుసు. నిజానికి రిపబ్లిక్ డే అంటే ఓ పండగ కాదు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మాటల్లో చెప్పుకోవాలంటే “ఈ దేశం గురించి మహాత్మ గాంధీ సహా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఎందరో కన్న కలలని నిజం చేయడానికి , అభివృద్ధి,ఆనంద పధంలో నిలపడానికి పునరంకితం కావాల్సిన రోజు” .
రిపబ్లిక్ డే జరుపుకోడానికి అసలు కారణం ?
1947 , ఆగష్టు 15 న దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మనదైన సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 . అప్పటి దాకా బ్రిటిష్ హయాంలోని 1935 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పాలన సాగించిన భారత్ సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాక సర్వసత్తాక గణ తంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.స్వాతంత్య్రం వచ్చిన 13 రోజుల తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ఏర్పాటు కోసం కమిటీ నియామకం జరిపారు.
ఈ కమిటీ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ముసాయిదా ( డ్రాఫ్టింగ్ ) కమిటీ ప్రపంచ దేశాల రాజ్యాంగాలని పరిశీలించి, అధ్యయనం చేసి 1947 , నవంబర్ 4 కల్లా ఓ ప్రతిని సిద్ధం చేసి అసెంబ్లీకి ( పార్లమెంట్ ) సమర్పించింది. ఆ ముసాయిదా ని అసెంబ్లీలో విస్తృతంగా చర్చించారు.
ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. మేధావులు నుంచి సలహాలు తీసుకున్నారు. ఇలా సుదీర్ఘ కసరత్తు జరిపాక అనేక మార్పులు చేర్పులతో రాజ్యాంగానికి ఓ రూపం తీసుకొచ్చారు. ఇంగ్లీష్, హిందీలో తయారైన రాజ్యాంగ ముసాయిదా రెండు రాత ప్రతులు అసెంబ్లీ ( పార్లమెంట్ ) ముందుకు వచ్చాయి. 1950 జనవరి 24 న 308 మంది సభ్యులున్న అసెంబ్లీ రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత రెండు రోజులకి 1950 , జనవరి 26 న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశం భారతీయులు తమకి అనుగుణంగా రూపొందించుకున్న రాజ్యాంగం ఆధారంగా పాలనా వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ఈ ఘట్టానికి ప్రారంభం అయిన రోజున రిపబ్లిక్ డే నిర్వహించుకుంటున్నాం.
రాజ్యాంగం తయారు చేసుకునే క్రమంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురు అయ్యాయి. అయితే కమిటీ వాటిని అన్నిటినీ అధిగమించింది. కమిటీ ఏర్పాటుకి, రాజ్యాంగ అమలుకు మధ్య దాదాపు మూడేళ్ళలో ఎన్నో ఆటుపోట్లు, భేదాభిప్రాయాలు వచ్చాయి.
అయితే అంబేద్కర్ మేధోతనంతో పాటు నాటి నాయకుల విశాల భావాలతో సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యింది. అయితే ఈ క్రమంలో అంబేద్కర్ మీద ఎక్కువ భారం పడిందని చెప్పుకోవాలి. అప్పటి కేంద్రమంత్రి టి. కృష్ణమాచారి మాటల్లో చెప్పుకోవాలంటే “ రాజ్యాంగ రచనా సంఘంలో నియమించిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. ఇంకొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నులయ్యారు. వున్న ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా వున్నారు. దీంతో భారమంతా అంబేద్కర్ మోయవలసి వచ్చింది. “ ఈ మాటలు అంబేద్కర్ నాడు రాజ్యాంగ రచనకి ఎంత శ్రమ చేశారో చెప్పకనే చెబుతాయి.
రిపబ్లిక్ డే వేడుకలు…
రిపబ్లిక్ డే ప్రధాన వేడుక దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో జరుగుతాయి. భారత సైనిక సామర్ధ్యం తెలిపే విధంగా పెరేడ్ నిర్వహిస్తారు. త్రివిధ దళాలు పాల్గొనే ఈ పెరేడ్ రిపబ్లిక్ డే వేడుకలకు హైలైట్.
ఇక దేశంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విధంగా ఇందులో పాల్గొనే శకటాల ని చూడ్డం అంటే అఖండ భారతాన్ని ఓ మినియేచర్ రూపంలో చూడడమే. ఈ వేడుకలకి ఓ విదేశీ అతిధిని ఆహ్వానించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది.
రిపబ్లిక్ డే వేడుకల వేదిక …
రిపబ్లిక్ డే వేడుకలు మొదటినుంచి ఇప్పుడు జరుపుకుంటున్నట్టు రాజ్ పథ్ లో జరగలేదు. 1950 నుంచి 1954 మధ్య వివిధ వేదికల మీద ఈ వేడుకలు జరిగాయి. ఇర్విన్ స్టేడియం , కింగ్స్ వే , ఎర్ర కోట , రామ్ లీల మైదానాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. 1955 నుంచి ఇప్పుడు జరుగుతున్న రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ మొదలైంది.
రిపబ్లిక్ డే వేడుకల ముగింపు …
అందరు అనుకున్నట్టు రిపబ్లిక్ డే వేడుకలు జనవరి 26 న మొదలై అదే రోజు ముగిసిపోవు. జనవరి 29 న బీటింగ్ రిట్రీట్ తో ముగుస్తాయి. రాష్ట్రపతి భవన్ రైసినా హిల్స్ లో జరిగే ఈ వేడుకలతో రిపబ్లిక్ డే వేడుకలు ముగుస్తాయి. నిజానికి ఈ వేడుకల మీద బ్రిటిష్ వారి ప్రభావం ఎక్కువ. బీటింగ్ రిట్రీట్ వేడుకలకి శ్రీకారం చుట్టడానికి కూడా బ్రిటిష్ రాణికి ఘనమైన ఆతిధ్యం ఇవ్వాలన్న ఆలోచనలో భాగమే అంటే ఆశ్చర్యం కలుగుతుంది.
1950 లో రాణి ఎలిజబెత్ 2 అతిధిగా వస్తున్నందున ఆమె కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే బాగుంటుందని అప్పటి ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా మేజర్ జి.ఏ రాబర్ట్స్ మాస్ బ్యాండ్స్ తో ఆహ్వానం , గౌరవం ఇచ్చే ప్రత్యేక విధానానికి శ్రీకారం చుట్టారు. కాలక్రమంలో ఆ వేడుకల్ని కొనసాగిస్తూ బీటింగ్ రిట్రీట్ కొనసాగింది. రిపబ్లిక్ డే అంటే నేటి తరానికి ఓ సెలవు దినంగానే తెలుస్తోంది. దీని వెనుక ఉద్దేశాన్ని, బాధ్యతను గుర్తు చేసేందుకే ఈ చిన్న ప్రయత్నం.