కోలీవుడ్ ను చూసి బుద్ధితెచ్చుకోండి… టాలీవుడ్ పై టీడీపీ ఎమ్మెల్సీ విమ‌ర్శ‌లు

Babu Rajendra Prasad comments On Tollywood Heros

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఏద‌న్నా అంశంపై ఆందోళ‌న చేస్తుంటే… అక్క‌డి సినీప‌రిశ్ర‌మ యావ‌త్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతుంది. పాల‌కుల‌పై ఒత్తిడి పెంచుతుంది. గ‌త ఏడాది జ‌రిగిన జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మంలో కూడా కోలీవుడ్ ప్ర‌జ‌ల‌కు మద్ద‌తుగా నిలిచింది. తెలుగు న‌టీన‌టుల విష‌యానికొచ్చేస‌రికి ప‌రిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్క‌డి హీరో, హీరోయిన్లు, ఇత‌ర న‌టీన‌టులు త‌మ సినిమాలు తాము త‌ప్ప‌ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరనే విమ‌ర్శ ఉంది. గ‌తంలో ప‌లుమార్లు ఈ విష‌యం రుజువ‌యింది కూడా. తాజాగా ప్ర‌త్యేక హోదాపై ఏపీ ర‌గిలిపోతున్న వేళ‌… మరోసారి తెలుగు న‌టీన‌టుల‌పై విమ‌ర్శ‌లు వ్యక్త‌మ‌వుతున్నాయి. హోదాపై ఇప్ప‌టిదాకా సినీ ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద‌గా స్పంద‌న‌లు రాలేదు. న‌టుడు శివాజీ హోదా కోసం ఆందోళ‌న‌లు చేస్తున్నారు కానీ ఆయన ఇప్పుడు రాజ‌కీయ‌వేత్త‌గా మారారు కాబ‌ట్టి… ఆయ‌న్ను సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తిగా చూడ‌లేం. ఇక మిగిలిన‌వారిలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఒక్క‌రే ప్ర‌స్తుత ప‌రిస్థితిపై స్పందించారు.

భ‌ర‌త్ అను టీజ‌ర్ లో చెప్పిన ఒక‌సారి మాట ఇచ్చి త‌ప్పితే యుఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అన్న ప‌దాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి అన్వ‌యిస్తూ న‌రేంద్ర‌మోడీ గారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇచ్చిన హామీని గుర్తుచేసి ఆయ‌న్ను మ‌నిషిని చేయండి. స‌ర్… మీరు తెలుగు రాష్ట్రాలు భార‌త‌దేశంలోని భాగ‌మే అని భావిస్తున్నారా అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో పెనుదుమార‌మే రేపింది. మోడీపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన కొర‌టాల శివ‌ను నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. అయితే ఈ స్పంద‌న చూసిన తర్వాత కూడా తెలుగు సినీజ‌నాల్లో మార్పు రాలేదు. ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు ఏ హీరోగానీ, ద‌ర్శ‌కుడు గానీ, హీరోయిన్ గానీ, ఇత‌ర విభాగాల‌కు చెందిన వారుగానీ ముందుకురావ‌డం లేదు. ఈ నిర్ల‌క్ష్యంపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ మండిప‌డ్డారు.

కేంద్ర‌ప్ర‌భుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్నా… ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. జ‌ల్లిక‌ట్టు అంశంలో త‌మిళ ప్ర‌జ‌ల‌కు అక్క‌డి చిత్ర‌ప‌రిశ్ర‌మ అండ‌గా ఉంద‌ని, మ‌రి టాలీవుడ్ కు ఏమ‌యింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోరాడే చేవ చ‌చ్చిపోయిందా..? అని తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, కేటీఆర్, క‌విత‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఏపీ పోరాటానికి మ‌ద్ద‌తు ప‌లికార‌ని, హైద‌రాబాద్ లోనే ఉంటున్న తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని ఒక్క‌రు కూడా దీనిపై మాట్లాడ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని వ్యాఖ్యానించారు. త‌మిళ న‌టీన‌టుల‌ను చూసైనా పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చిన రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇక‌నైనా ఉద్య‌మించ‌క‌పోతే ఐదు కోట్ల ఆంధ్రులు సినీ ప‌రిశ్ర‌మ‌ను వెలివేసే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రించారు.