రోహిత్ చేతిలో శ్రీలంక జెండా… కార‌ణ‌మిదే…

India Team with Sri Lanka Flag

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కీల‌క‌మ్యాచ్ ల్లో విజ‌యం సాధించిన‌ప్పుడు క్రికెట‌ర్లు త‌మ దేశ జాతీయ జెండా ప‌ట్టుకుని మైదానంలో క‌లియ‌తిరుగుతూ సంబ‌రాలు చేసుకుంటారు. ఆదివారం బంగ్లాదేశ్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో గెలుపు త‌ర్వాత భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం శ్రీలంక జాతీయ ప‌తాకం ప‌ట్టుకుని కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియ‌మంతా చుట్టివ‌చ్చాడు. ఎందుకంటారా..?

ఫైన‌ల్లో భార‌త జ‌ట్టుకు శ్రీలంక అభిమానులు అందించిన మ‌ద్ద‌తుకు కృత‌జ్ఞ‌త‌గా… నిజానికి త‌మ దేశ‌పు మ్యాచ్ ఉంటేనే స్థానిక అభిమానులు స్టేడియానికి భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తారు. వేరే దేశాల మ్యాచ్ ల‌పై పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌రు. ఫైన‌ల్ వంటి మ్యాచ్ లు కూడా ఇందుకు పెద్ద మిన‌హాయింపుకాదు. కానీ ఆదివారం త‌మ దేశం ఆడ‌క‌పోయినప్ప‌టికీ ఫైన‌ల్ మ్యాచ్ కు శ్రీలంక అభిమానులు దాదాపు 20 వేల‌మంది త‌ర‌లివ‌చ్చారు. వారంతా స్టేడియంలో భార‌త్ కు పూర్తి మ‌ద్ద‌తునిస్తూ నినాదాలు చేశారు. భార‌త‌దేశ జాతీయ ప‌తాకం ఊపుతూ ఇండియా గెల‌వాల‌ని మ‌న‌సారా కోరుకున్నారు. దినేశ్ కార్తీక్ విన్నింగ్ సిక్స్ కొట్ట‌గానే… త‌మ‌దేశ‌మే గెలిచినంత ఆనందంగా లంకేయులు సంబ‌రాలు చేసుకున్నారు. లంక అభిమానుల మ‌ద్ద‌తు అద్భుత‌మ‌ని, పరాయి దేశంలో ఆడుతున్న‌ట్టే లేద‌ని, బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిస్థాయిలో ప్రోత్స‌హించార‌ని మ్యాచ్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ చెప్పాడు. లీగ్ మ్యాచ్ ల్లో భార‌త్ ఆడిన మ్యాచ్ ల‌కు జ‌నాలే రాలేద‌ని, ఫైన‌ల్ కు మాత్రం లంక అభిమానులు భారీస్థాయిలో హాజ‌రై అండ‌గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని దినేశ్ కార్తీక్ కూడా చెప్పాడు. లంకేయులు భార‌త్ కు ఇంత‌గా మ‌ద్ద‌తు తెల‌ప‌డానికి బంగ్లాదేశ్ పై ఉన్న ఆగ్ర‌హ‌మే కార‌ణం.

శ్రీలంక బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో మైదానంలో శ్రీలంక ఆట‌గాళ్ల‌తో బంగ్లా ఆట‌గాళ్లు బాహాబాహీకి దిగ‌డం, డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ప‌గ‌లుగొట్ట‌డం, గెలిచిన‌ త‌ర్వాత నాగిని నృత్యాలు చేయ‌డం లంక అభిమానులకు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. అందుకే త‌మ‌దేశం ఫైన‌ల్లో లేక‌పోయినా… పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి… బంగ్లాకు వ్య‌తిరేకంగా, భార‌త్ కు అనుకూలంగా స్టేడియంలో సంద‌డిచేశారు. దేశం కాని దేశంలో పెద్ద ఎత్తున ల‌భించిన మ‌ద్ద‌తు భార‌త ఆట‌గాళ్ల‌పై సానుకూల ప్ర‌భావం చూపించింది. న‌రాలుతెగే ఉత్కంఠ తో సాగిన మ్యాచ్ లో భార‌త్ అద్భుత విజ‌యం సాధించింది. అందుకే లంక అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌గా… రోహిత్ శ‌ర్మ వారి జాతీయ జెండా ప‌ట్టుకుని మైదానంలో క‌లియ‌తిరిగాడు. ఇత‌ర భార‌త క్రికెట‌ర్లు కెప్టెన్ ను అనుస‌రించారు. ఈ ఫొటో ఇప్పుడు నెట్ లో వైర‌ల్ గా మారింది. రోహిత్ భార‌త్ తో పాటు శ్రీలంక అభిమానుల మ‌నసు గెలుచుకున్నాడ‌ని, బ్యూటీ ఆఫ్ క్రికెట్, లంక జెండాతో రోహిత్ శ‌ర్మ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.