రాము అన్నందుకే తుమ్మల అవుట్…!

Revanth Asks EC To Stop KCR Cabinet Expansion

అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కాస్త సైలెంట్ అయి మీడియాకి దూరంగా ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మళ్ళీ దూకుడు పెంచారు. ఈరోజు నోటుకు ఓటు కేసు ఈడీ విచారణ, అలాగే మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు అహంకారం తలకెక్కిందని ఎన్నికల ఫలితాలు వెలువడి 60 రోజులు గడుస్తున్నా పాలనపై సీరియ్‌సగా దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి దగ్గర రూ.50 లక్షలు దొరికినా ఆ కేసును ఈడీకి ఇవ్వలేదని నాపై మాత్రం ఐటీ, ఈడీ కేసులు కావాలని పెట్టించారని ఆయన ఆరోపించారు.

నాపై, వేం నరేందర్‌ రెడ్డిపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కానీ, వేం నరేందర్‌ రెడ్డి కొడుకులను పిలిచి విచారిస్తారా? కేటీఆర్‌ కొడుకునంటే మీకు బాధయింది. మరి, మా పిల్లలను విచారిస్తే మేం ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసింది ప్రజలు కాదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు వేశారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. గెలిచినా, ఓడినా, ఎక్కడున్నా తాను కంఫర్ట్‌గానే ఉంటానని కేబినెట్‌ విస్తరణలో అసమర్థులకే కేసీఆర్‌ చోటు కల్పిస్తారని రేవంత్‌ జోస్యం చెప్పారు. హరీష్ రావుకు మంత్రి పదవి రాదని, ఒకవేళ హరీష్ ఎదురు తిరిగితే పాసుపోర్టుల కేసులో ఇరికించేందుకు కేసీఆర్‌ రెడీగా ఉన్నారని కేటీఆర్‌ను రాము అని పిలిచినందుకే మాజీ మంత్రి తుమ్మల ఎన్నికల్లో ఔట్‌ అయిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే రేవంత్ గతంలో చేసిన ఈవీఎం ట్యాంపరింగ్ వ్యాఖ్యలు మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి.