రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్‌

రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్‌

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్‌ దొరికింది. అతడిని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ట్విటర్‌ వేదికగా ఆదివారం ప్రకటించారు. యువతను క్రీడలు, ప్రజారోగ్యం వైపునకు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

స్వయంగా వీడియోకాల్‌ చేసి పంత్‌కు తమ నిర్ణయాన్ని సీఎం చెప్పారు. అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో పంత్‌ స్పందించాడు. ప్రజలకు క్రీడలు, ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని సీఎంతో అన్నాడు. ప్రభుత్వం తనకిచ్చిన అవకాశం పట్ల సీఎంకు అతను ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు పంత్‌ ట్వీట్‌చేశాడు.

ఇక ఆట విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా టెస్టు స్క్వాడ్‌లో పంత్‌ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్టుతో కలిసి అతను జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్నాడు. ఢిల్లీ కేపిటల్స్‌ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను 2022 ఐపీఎల్‌ సీజన్‌కు ఆ జట్టు రిటైన్‌ చేసుకుంది. ఇప్పటివరకు 25 టెస్టుల్లో 1549 పరుగులు, 18 వన్డేల్లో 529 పరుగులు , 41 అంతర్జాతీయ టీ20ల్లో 623 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 2500 పరుగులు చేశాడు.