రోహిత్‌ ప్రశంసల జల్లు

రోహిత్‌ ప్రశంసల జల్లు

‘‘బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్న విషయాల గురించి ఆలోచించడం వృథా అని నేను భావిస్తాను. మేమిద్దరం ఒకరి గురించి ఒకరం ఏమను​కుంటున్నాం అనేదే మాకు ముఖ్యం. ఎక్స్‌వైజెడ్‌ గురించి నేను ఏమనుకుంటున్నానో అదే ముఖ్యం.. ఆటగాళ్ల మధ్య బంధం బలపడే వాతావరణాన్ని సృష్టించి లక్ష్యాన్ని చేరుకోవడంపై దృష్టి సారించడమే అన్నింటే మరింత ముఖ్యమైనది’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

వన్డే కెప్టెన్సీని హిట్‌మ్యాన్‌కు అప్పగించడంతో విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ మధ్య దూరం పెరిగిందని, విభేదాలు తారస్థాయికి చేరాయంటూ పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వన్డే కెప్టెన్‌గా తాను కొనసాగుతానని కోహ్లి ప్రకటించినా… బీసీసీఐ మాత్రం రోహిత్‌ వైపే మొగ్గుచూపడం అతడికి మింగుడుపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్‌గా అధికారికంగా నియమితుడైన తర్వాత తొలిసారిగా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ.. తనకు కోహ్లి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పాడు.

అంతేగాక కోహ్లి సారథ్యం వల్లే జట్టు ఈ స్థాయిలో ఉందని ప్రశంసించాడు.ఈ మేరకు.. ‘‘కోహ్లి కెప్టెన్సీలో మేము చాలా గొప్ప మ్యాచ్‌లు ఆడాము. ఆటను పూర్తిగా ఆస్వాదించాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేశాము. ఇక ముందు కూడా అదే కొనసాగుతుంది. నిజానికి తను జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపాడు. ఐదేళ్ల కాలంలో అలుపెరుగని కృషి చేశాడు. ఇప్పుడు.. కూడా అదే స్ఫూర్తితో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలన్నదే నా అభిమతం’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఇక టీమిండియాకు ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురి చేస్తుందన్న రోహిత్‌ శర్మ… ఆటపై దృష్టి సారించి ముందుకు వెళ్లడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు. ‘‘భారత్‌ తరఫున ఆడుతున్నపుడు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చాలా మంది మా గురించి మాట్లాడుతూ ఉంటారు. కొందరు పాజిటివ్‌గా మాట్లాడితే.. మరికొందరు నెగటివ్‌గా… అయితే, ఓ క్రికెటర్‌గా… కెప్టెన్‌గా నా పనేంటో దానిపై మాత్రమే దృష్టి పెట్టడం ముఖ్యం.. బయట ఎవరు ఏమి మాట్లాడుతున్నారో పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని రోహిత్‌ స్పష్టం చేశాడు.