కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్న రోజా

కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్న రోజా

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ జిల్లాలో రాజకీయ సమీకరణాలు.. ఇతర కారణాలతో ఆమెకు మంత్రి పదవి ద‌క్క‌లేదు. దీంతో రోజాకు ఏపీఐఐసీకి చైర్మన్ ప‌ద‌వి అప్ప‌గించారు ముఖ్య‌మంత్రి జగన్‌. అయితే ఇప్పుడు రోజా సరికొత్త టార్గెట్‌ పెట్టుకున్నారు. కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం  గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతో గెలిచారు.

చివరి వరకు ఆమె ఓడిపోతారనే ప్రచారం జరిగింది. కానీ చివరికి రెండు వేల బోటాబొటీ ఓట్లతో ఆమె నెగ్గారు. దీంతో రోజాకు నియోజకవర్గంపై పట్టు లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. మెజార్టీ రాకపోవడంతో పాటు నగరి, చిత్తూరు జిల్లాలో నెల‌కొన్న పరిస్థితుల వ‌ల్లే ఆమెకు మంత్రి పదవి ద‌క్క‌లేద‌నే పార్టీలో ప్ర‌చారం జ‌రిగింది. దీంతో నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు రోజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌ అయిన తర్వాత రోజా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు చేప‌డుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

గ‌తంలో రోజా టీవీ షోల మీద ఎక్కువ దృష్టి పెట్టి, నియోజకవర్గాన్ని విస్మ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నా యి. ఈ క్ర‌మంలోనే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు రోజా.. ఇకపై ఆ ముద్రను చెరిపేసేందుకుగాను నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే టీవీ షోలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం జబర్దస్త్ షోకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు నగరిలోనే ఇల్లు కూడా కట్టుకుని, ఇటీవలే గృహప్రవేశం కూడా చేశారు.మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం జగన్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే ఈసారైనా మంత్రివ‌ర్గంలో బెర్త్ ద‌క్కించుకోవాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో రోజా ముందుకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.