ఈ ఘనత సాధించిన తొలి యూరప్‌ ప్లేయర్

ఈ ఘనత సాధించిన తొలి యూరప్‌ ప్లేయర్

దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయస్థాయిలో (దేశం తరఫున ఆడే మ్యాచ్‌లు) 100 గోల్స్‌ పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి యూరప్‌ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ (యూఈఎఫ్‌ఏ) నేషన్స్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్‌ ‘3’ లీగ్‌ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 2–0 గోల్స్‌ తేడాతో స్వీడన్‌ను ఓడించింది.

35 ఏళ్ల రొనాల్డో ఆట 45వ నిమిషంలో గోల్‌ చేయడంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ గోల్‌ మైలురాయి చేరుకున్నాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో రొనాల్డో రెండో గోల్‌ కూడా చేసి తమ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గోల్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్‌ సంఖ్య 101కు చేరింది. అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు అలీ దాయి (ఇరాన్‌) పేరిట ఉంది. 2006లో రిటైరైన 51 ఏళ్ల అలీ దాయి ఇరాన్‌ తరఫున మొత్తం 109 గోల్స్‌ సాధించాడు.

2003లో జాతీయ సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన రొనాల్డో ఇప్పటి వరకు పోర్చుగల్‌ తరఫున 165 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. మొత్తం 41 దేశాలపై కనీసం ఒక గోల్‌ అయినా చేశాడు. లిథువేనియా, స్వీడన్‌ దేశాలపై రొనాల్డో అత్యధికంగా ఏడు గోల్స్‌ చొప్పున చేశాడు.రొనాల్డో తాను చేసిన మొత్తం 101 గోల్స్‌లో 41 గోల్స్‌ మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో… 60 గోల్స్‌ రెండో అర్ధ భాగంలో సాధించాడు.

ఓవరాల్‌గా రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌లో 9 సార్లు ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. రొనాల్డో గోల్‌ చేసిన మ్యాచ్‌ల్లో పోర్చుగల్‌ 55 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. ఐదు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది.ప్రొఫెషనల్‌ కెరీర్‌లో రొనాల్డో మొత్తం 447 గోల్స్‌ చేశాడు.