11వ రోజుకు చేరుకున్నఆర్టీసీ సమ్మె

11వ రోజుకు చేరుకున్నఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో పాటు ఇతర ప్రజాసంఘాలు కూడ ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికాయి. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు మద్దతు పలికారు. టీఎన్జీవో నేతలు ఆర్టీసీ చేపట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మద్దతు పాటు సమ్మెలో కూడ భాగస్వామ్యులం కానున్నట్టు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ సమ్మె కీలక మలుపు తిరగనుంది. ఆర్టీసీ కార్మికులకు తోడు ప్రభుత్వ ఉద్యోగులు కూడ ఏకం అయితే ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు గత కొద్ది రోజులుగా టీఎన్‌జీవో నాయకుల మద్దతు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఇరువర్గాల మధ్య సమావేశం ఉన్న రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు టీఎన్‌జీవో సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చేందుకు ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారంటూ అటు రాజకీయ నాయకుల తోపాటు ఆర్టీసీ జేఏసీ నాయకులు పలు ఆరోపణలు చేశారు.

తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన టీఎన్‌జీవో నేతలు ఆర్టీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సమ్మెకు వెళుతున్న సమయంలో తమను కనీసం సంప్రదించలేదని చెప్పారు. ఆర్టీసీ సర్వీసు రూల్సుకు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్సుకు మధ్య సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి ప్రభుత్వ ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకుల పాత్ర లేకుండా పోరాటం చేయాలని సూచించారు. ఆర్టీసీ నాయకులు అడిగితే మద్దతు తెలుపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగళవారం టీఎన్జీవో నేతలతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలవాలని జేఏసీ నాయకులు, టీఎన్జీవో నేతలను కోరారు.