శ‌బ‌రిమ‌ల థాయ్ లాండ్ అవుతుంది

In SC Temple Board Supports Entry Of Women Into Sabarimala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ‌బరిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై ఆల‌య అధికారి, ట్రావెన్ కోర్ దేవ‌స్వం బోర్డు అధ్య‌క్షుడు గోపాల కృష్ణ‌న్ అత్యంత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్ర‌వేశిస్తే… దేవాల‌య ప్రాంగ‌ణం నీతిలేని పనుల‌కు నిల‌యంగా మారుతుంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌బ‌రిమ‌ల క్షేత్రాన్ని థాయ్ లాండ్ గా మార్చేందుకు తాము ఒప్పుకోబోమ‌న్నారు. 10-50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల‌లోకి ప్ర‌వేశించ‌డాన్ని నిషేధించ‌డం స‌మ‌ర్థ‌నీయ‌మా…కాదా అన్న అంశాన్ని తేల్చే బాధ్య‌త‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేసిన నేప‌థ్యంలో గోపాల కృష్ణ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ మ‌హిళ‌ల ప్ర‌వేశంపై ఉన్ననిషేధాన్ని సుప్రీంకోర్టు తీసివేసిన‌ప్ప‌టికీ…ఈ తీర్పును సంప్ర‌దాయ కుటుంబంలో పుట్టిన మ‌హిళ‌లెవ‌రూ గౌర‌వించబోర‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. సంప్ర‌దాయాల‌ను పాటించే మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌ర‌ని ఆయ‌న తెలిపారు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి సుప్రీంకోర్టు నివేదించిన‌ప్ప‌టికీ.. తాము మాత్రం గ‌తంలోలానే మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని, రుతుక్ర‌మం వ‌య‌సులో ఉండే మ‌హిళ‌లు ఆల‌యంలోకి రాకూడ‌ద‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌ని ఆయ‌న చెప్పారు.

ఒక‌వేళ రాజ్యాంగ ధ‌ర్మాస‌నం మ‌హిళ‌ల‌ను అనుమ‌తిస్తే.. వారి ర‌క్ష‌ణ‌కు తాము గ్యారంటీ ఇవ్వ‌లేమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌హిళ‌లు ఆల‌యానికి వ‌స్తే ఇది థాయ్ లాండ్ త‌ర‌హాలో అశ్లీల ప‌ర్యాట‌కానికి అడ్డాగా మారుతుంద‌ని, చాలా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌హిళ‌ల నిషిద్ధం కొన్ని త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయ‌మ‌ని, దాన్ని గౌర‌వించాల‌ని ఆయ‌న కోరారు. ఇప్పుడే కాదు… గ‌తంలోనూ గోపాల్ కృష్ణ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుచేశారు. దేవాల‌యంలోకి ప్ర‌వేశించే ముందు మ‌హిళ‌ల ప‌రిశుద్ధ‌త‌ను ప‌రీక్షించ‌డానికి ఓ యంత్రాన్ని పెట్టాల‌ని గ‌తంలో వ్యాఖ్యానించారు. అటు గోపాల కృష్ణన్ వ్యాఖ్య‌ల‌ను కేర‌ళ దేవాదాయ వ్య‌వ‌హారాల మంత్రి కాకంప‌ల్లి సురేంద్ర‌న్ ఖండించారు. ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు ఎందుకు చేశారో అర్దంకావ‌డం లేద‌ని, మ‌హిళ‌లను, యాత్రికుల‌ను ఆయ‌న అవ‌మానించార‌ని, దీనిపై క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మంత్రి డిమాండ్ చేశారు.