ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల వేతనాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల వేతనాలు

కరోనా వైరస్‌ బారిన పడ్డ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ నర్సుల వేతనాలను రూ.25 వేలకు పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అదేవిధంగా పనిచేసిన రోజున రూ.500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. వేతనాల పెంపను కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన సరికాదని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈక్రమంలో స్పందించిన ప్రభుత్వం వేతన పెంపుతో పాటు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోవిడ్‌–19 ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా పనిచేసిన రోజున రూ.300 ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్‌ బాధితులకు ఇబ్బంది కలగకూడదని సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రకటించింది. వెంటనే విధుల్లో చేరనున్నట్లు తెలిపింది.