బాబు చెప్పినా వినని సండ్ర…డౌటే…!

Sattupalli MLA Sandra Venkata Veeraiah To Join TRS Party

తెలుగుదేశం ఎమ్మెల్యే త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఇటీవల తెలంగాణలో ముగిసిన ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టీడీపీకి రాజీనామా చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఆ పార్టీకి చెందిన నేతలు కొట్టివేసినా ఇది నిజమేననే టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా 13 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీడీపీ సిట్టింగ్ స్థానం సత్తుపల్లి, అశ్వారావుపేటలోనే. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. వీరిద్దరిపై తెలంగాణ రాష్ట్ర సమితి కన్నేసింది. టీఆర్ఎస్‌లో చేర్చుకుని, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా చేయాలని గులాబీ పార్టీ ప్లాన్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారట టీఆర్ఎస్ బాస్. దీనిపై వస్తున్న పుకార్లను ఖండించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు చంద్రబాబును కలిశారు. పార్టీని వీడాలన్న ఎవరి ఒత్తిడికీ తలొగ్గాల్సిన అవసరం లేదని, ఏ అవసరమైనా నేరుగా తనను కలవాలని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తుదిశ్వాస విడిచేవరకు పార్టీలోనే కొనసాగుతానని ఆయనకు స్పష్టం చేసినట్లు మెచ్చా వివరించారు. అయితే, సండ్ర మాత్రం తనతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపారని, కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అంటే పరోక్షంగా తాను పార్టీ మారుతున్నట్లు చెప్పేస్తున్నారు. విషయం తెలిసిన చంద్రబాబు.సండ్రతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం టీటీడీ సభ్యుడిగా ఉన్న మీకు భవిష్యత్‌లో మరింత ప్రాధాన్యతను ఇస్తానని చంద్రబాబు అన్నట్లు సమాచారం. అయినా, ఈ విషయంలో సండ్ర నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది. మెచ్చా నాగేశ్వర్రావును తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సైకిల్ పార్టీని వీడేది కన్ఫార్మ్ అనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం.