సీనియర్ నటుడు ఆకస్మిక మృతి

ప్రముఖ నాటక రంగ, సినీ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ ఇవాళ ఉదయం 6.30గంటలకు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కర్నాడ్ 1938 మే 19న మహారాష్ట్రలోని మధేరాలో జన్మించారు. ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, రక్షకుడు వంటి పలు చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. 1998లో జ్ఞాన‌పీఠ‌ అవార్డును కర్నాడ్ అందుకున్నారు.‘వంశవృక్షం’ అనే కన్నడ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు దక్కింది. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను కూడా గిరీష్ కర్నాడ్ అందుకున్నారు.  వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మ చక్రం’ అనే సినిమా ద్వారా ఆయన టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత శంకర్ దాదా-ఎంబీబీఎస్, కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్ తనే సినిమాల్లో ఆయన నటించారు. మద్రాస్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేస్తున్న సమయంలో డా.సరస్వతి గణపతిని ఆయన ఓ పార్టీలో కలుసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వాళ్లు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.